బోనకల్లు, నవంబర్ 24 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవిందాపురం ఎల్ గ్రామంలో ఆ పార్టీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు, గూండాగిరి పెరిగిపోయాయని లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నాయకుడు మాదినేని వీరభద్రరావు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం సొసైటీ కార్యాలయంలో రైతులకు ప్రశాంతంగా ఎరువుల పంపిణీ జరుగుతుండగా, కాంగ్రెస్ నాయకులు పథకం ప్రకారం ఘర్షణలు సృష్టించినట్లు తెలిపారు. ఈ ఘర్షణల్లో ప్రధానంగా ఉమ్మనేని రమేశ్, ఉమ్మనేని బాబు, సాదం కొండలరావు, ఉమ్మనేని రవితో పాటు మనోజ్ కుమార్ ఉన్నట్లు చెప్పారు.
ఎరువుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడాన్ని వీరభద్రరావు తీవ్రంగా ఖండించారు. పాస్బుక్ లేకుండా ఎరువులు ఇవ్వాలని తమను కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయగా తాము అంగీకరించలేదన్నారు. అందుకే ఘర్షణలు సృష్టించారని, షేక్ జానీ అనే రైతు చొక్కా చింపి దాడి చేశారన్నారు. తాను అక్రమాలకు పాల్పడితే కాంగ్రెస్ నాయకులతో కమిటీ వేసుకుని విచారణ చేయించుకోవచ్చన్నారు. విచారణలో తాను తప్పు చేసినట్లు రుజువైతే లక్ష్మీపురం సొసైటీ అధ్యక్ష పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని మాదినేని వీరభద్రరావు సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నప్పటికీ లక్ష్మీపురం సొసైటీ ఏ ఒక్క రైతు నష్టపోకుండా, భూమి ఉన్న ప్రతి రైతుకి పాస్బుక్ ఆధారంగా ఎరువులు అందిస్తున్న ఘనత సొసైటీకి దక్కుతుందని వీరభద్రరావు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, కన్నెపోగు జయరాజు, ఆదూరి నాగేశ్వరరావు, షేక్ జాన్ మియా, పుచ్చకాయల తిరుపతయ్య పాల్గొన్నారు.