జూలూరుపాడు, అక్టోబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బొజ్జ తండా గ్రామానికి చెందిన రైతులు సాగు చేస్తున్న సుమారు 100 నుంచి 150 ఎకరాలు పత్తి మిర్చి వరి పంట పొలాలు భారీ వర్షానికి కొట్టుకుపోయాయి. మండలంలో బోజాతండా, పాపకొల్లు, వెనక తండా గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలు సుమారుగా 100 నుంచి 150 ఎకరాలు శనివారం రాత్రి వచ్చిన అకాల వర్షానికి పత్తి పంట చేతికి వచ్చే సమయానికి నీటిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరానికి సుమారు50 నుంచి 60 వేలు పెట్టుబడి పెట్టామని.. కానీ పంట చేతికొచ్చే సమయానికి వర్షానికి కొట్టుకుపోవడంతో నష్టపోయామని గిరిజన రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ పంటలను గ్రామ రైతులతో కలిసి సీపీఎం పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్ పరిశీలించారు. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తక్షణమే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులందరికీ పరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత 30 ఏండ్లలో ఈస్థాయి వరదలు ఎప్పుడు రాలేవని అన్నారు. పంటతో పాటు చేలలో ఉన్న తైవాన్ పంపులు, మందు కట్టలు, మోటర్లు, పైపులు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.