బూర్గంపహాడ్, మే 06 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 42 రోజులుగా కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి విధితమే. మంగళవారం రాత్రి జనరల్ బాడీ మీటింగ్లో గుర్తింపు సంఘం వేతన ఒప్పంద వివరాలు వెల్లడించిన తర్వాత కాంట్రాక్టు కార్మికులు వేతన ఒప్పందానికి వ్యతిరేకంగా పీఎం 6 గేటు వద్ద వంటావార్పు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. వేతన ఒప్పందంలో కాంట్రాక్టు కార్మికులకు తీరని అన్యాయం జరిగిందని సీ షిఫ్ట్ కార్మికులు విధులు బహిష్కరించడంతో అదే సమయంలో ఓ కాంట్రాక్టర్ కార్మికులను లోనికి పంపే ప్రయత్నం చేశారని ఆ క్రమంలో జరిగిన తోపులాటలో ఓ కార్మికుడి తలపై రాడ్డుతో వెనుక నుంచి దాడిచేయడంతో తలకు తీవ్రగాయమైందని, స్థానికులు అతన్ని ఆస్పత్రికి పంపినట్లు కార్మికులు తెలిపారు.
కాంట్రాక్టు కార్మికులపై ఇలాంటి దాడుల చేయడం అన్యాయమన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు నిరసన తెలుపుతామని కాంట్రాక్టు జేఏసీ కార్మిక నాయకులు పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజాము వరకు వంటావార్పుతో కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. నిరసన అనంతరం కాంట్రాక్టు కార్మికులతో యాజమాన్యం, గుర్తింపు సంఘం చర్చలు జరిపి మూడు రోజుల పాటు సమ్మెను వాయిదా వేయాలని అడిగారని.. కాంట్రాక్టు కార్మికులు ఆ మేరకు అంగీకారం తెలిపారని, సమస్య పరిష్కారం కాకపోతే గడువు తర్వాత మళ్లీ సమ్మె చేపడతామని జేఏసీ నాయకులు స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

వేతన ఒప్పందానికి వ్యతిరేకంగా కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ వంటావార్పు