చండ్రుగొండ, ఏప్రిల్ 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మహ్మద్‌నగర్ గ్రామంలో బుధవారం ఇందిరమ్మ బడిబాట కార్యక్రమానికి వచ్చిన అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణకు ఆ పార్టీ కార్యకర్తల నుండి నిరసన సెగ తగిలింది. మహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన రాజోలు అనే కాంగ్రెస్ కార్యకర్తను గత నెలలో అధికార పార్టీకి చెందిన మరో వర్గం కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. ఈ కేసు విషయంలో పరస్పరం పోలీసులు కేసులు నమోదు చేశారు.
దాడి చేసిన వారిపై కాకుండా గాయపడిన వారిపై పోలీసులు లంచాలు తీసుకొని తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్యే బడిబాట కార్యక్రమంలో బహిరంగంగా రాజోలి వర్గానికి చెందిన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. లంచాలు తీసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఎస్ఐ పాపారావు పై ఎమ్మెల్యే ఆదినారాయణ ఎదుట కాంగ్రెస్ కార్యకర్త రాజోలి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి జారిపోతుండతో ఎమ్మెల్యే అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నారు. ఎమ్మెల్యే దత్తత గ్రామంలో నిరసన సెగ అధికార పార్టీ నేతలను ఇబ్బంది పెట్టినట్టుంది. ఏది ఏమైనా అధికార పార్టీ నాయకుడి పర్యటనలో ఆ పార్టీ కార్యకర్తలే నిరసన వ్యక్తం చేయడం పట్ల గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేశారు.