Kothagudem | కొత్తగూడెం ప్రగతి మైదాన్, జనవరి 24: అధికార పార్టీ అండదండలతో అహంకారాన్ని ప్రదర్శించాడు ఆ సర్పంచ్..! పొత్తు పార్టీకి చెందిన కమ్యూనిస్టు వార్డు మెంబర్‌పై సుపారీ ఇచ్చి మరీ హత్యాయత్నానికి ఒడిగట్టాడు..? పాలమ్మేందుకు వచ్చిన ఆ లీడర్‌పై సుపారీ గ్యాంగ్ దాడికి పాల్పడింది..! ఈ ఘటన కొత్తగూడెం నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం స్టేషన్ బేతంపూడి పరిధికి చెందిన కమ్యూనిస్టు పార్టీ వార్డు సభ్యుడు పోమియాపై అధికార పార్టీ సర్పంచ్ సుపారి గ్యాంగ్ తో హత్యాయత్నానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. పోమియా పాలు అమ్మేందుకు ఈనెల 12వ తేదీన కొత్తగూడెం పట్టణానికి వచ్చాడు. నేతాజీ మార్కెట్లో పాలమ్మేందుకు వెళ్లాడు. అక్కడ కొందరు దుండగులు పోమియాతో అకారణంగా గొడవ పెట్టుకున్నారు. అతన్ని విచక్షణారహితంగా కొట్టారు. వారి దాడి నుంచి తప్పించుకున్న పోమియా త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు.
పోమియా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటి ఆధారంగా పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అధికార పార్టీకి చెందిన సర్పంచ్.. ఆ గ్యాంగ్‌కు రూ.10 వేలు సుపారీ ఇచ్చి హత్యకు స్కెచ్ వేసినట్లుగా తెలిసింది. ఈ ఘటనపై కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఒక్క నాయకుడు కూడా నోరు మెదపకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని బయటికి రాకుండా పొత్తు పార్టీ తొక్కి పెట్టిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ సదరు వార్డు సభ్యుడిపై సుపారీ ఇచ్చి దాడికి యత్నించిన అధికార పార్టీ సర్పంచ్ పై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది.