పాల్వంచ, ఫిబ్రవరి 06 : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పంగనామాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం జరగబోయే కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పాల్వంచలోని 8వ డివిజన్లో కాంపల్లి సంధ్య విజయాన్ని కాంక్షిస్తూ ఆయన శుక్రవారం ప్రచార నిర్వహించారు. 8వ వార్డులోని శ్రీనివాస కాలనీ, కుంటినాగులగూడెం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రజలను మభ్యపెట్టి కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలతో పాటు తుల బంగారం, పింఛన్లు 2 వేల నుండి 4 వేలు, మహిళలకు రూ.2,500, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ తదితర హామీలను ఇచ్చి వాటన్నింటినీ తుంగలో తొక్కిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేశారని, కరోనా సమయంలో కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు తలెత్తకుండా, అభివృద్ధి పనులు ఆగిపోకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా అన్నిటినీ ఆయన సమన్వయం చేసుకుంటూ సమాజాన్ని, ప్రజల్ని కాపాడుకున్నారని ఆయన అన్నారు. ఆనాడు కేసీఆర్ పాలనలోనే అతిపెద్ద అభివృద్ధి జరిగిందని ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి పనులు చేసుకుంటూ పోవడం జరిగిందని, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, కలెక్టరేట్లను, రెవిన్యూ డివిజన్లో ఏర్పాటు చేసి కొత్త పంచాయతీలు కూడా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను స్వాగతిస్తూ ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని ఆయన కోరారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి : రేగా కాంతారావు