వికారాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు(సర్)లో జిల్లాలో భారీగా ఓట్లను తొలగించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో 2011 ఓటరు జాబితా ప్రకారం మొత్తం 10,17,671 ఓట్లు ఉండగా సర్ ప్రక్రియ చేపట్టి 2.10 లక్షలపైగా ఓట్లను తొలగించారు. జిల్లాలో వందశాతం ప్రక్రియ పూర్తయినట్టు జిల్లా ఎన్నికల అధికారులు లెక్కలు చూపుతున్నా బీఎల్వోలు క్షేత్రస్థాయిలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో క్షుణ్ణంగా ప్రక్రియ పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. కాగా, జిల్లాలో 79.28 శాతమే ఓట్లకు సంబంధించి ప్రక్రి య పూర్తికాగా, మరో 2,10,842 ఓట్లకు సంబంధించి ఏఎస్డీ(గైర్హాజరు, వలసెళ్లినవారు, మరణించినవారు) ఓట్లు ఉన్నట్టు బీఎల్వోలు గుర్తించారు.
సోమవారం కూడా కొందరు బీఎల్వోలు ఓటర్లకు ఫోన్లు చేసి మీ ఎస్ఐఆర్ ఫారం రిజెక్ట్ అయ్యింది. వెంటనే 2002లో మీ కుటుంబ సభ్యు ల ఓటు వివరాలతో వస్తే ఓటు జాబితాలో ఉంటది లేదంటే తొలగిస్తామంటూ అయోమయానికి గురి చేశారు. వరుస సెలవులు కావడంతో స్థానికంగా చాలామంది లేకపోవడంతో సంబంధిత ఓటర్లందరి ఫారాలను రిజెక్ట్డ్ జాబితాలోనే ఉంచా రు. దాదాపు రెండు నెలలపాటు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగినా చివరి రోజు వరకు కొందరు బీఎల్వోలు ఓటర్లకు సమాచారమివ్వకపోవడంపై వారిపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈనెల 17న ఓటరు ముసాయిదాను ప్రకటించనున్నారు, ఈనెల 18 నుంచి నెలరోజులపాటు ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరించి, అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనున్నది.
ఎస్ఐఆర్ ప్రక్రియలో జిల్లాలో 2,10,842 ఓట్లు గల్లంతయ్యాయి. ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు గుర్తించిన ఓట్లలో మరణించిన, వలసెళ్లిన, ఎస్ఐఆర్ ప్రక్రియ గైర్హాజరైన ఓటర్లను పరిగణనలోకి తీసుకొని తొలగించారు. అత్యధికంగా తాండూరు నియోజకవర్గంలో గల్లంతయ్యాయి. తాండూరులో 65,631 ఓట్లను శాశ్వతంగా వలసెళ్లిన, మరణించిన, గైర్హాజరైన ఓటర్లుగా గుర్తించి తొలగించారు. పరిగి నియోజకవర్గంలో 52,891 ఓట్లు, వికారాబాద్ నియోజకవర్గంలో 52,380 ఓట్లు, కొడంగల్ నియోజకవర్గంలో 39,940 ఓట్లను తొలగించేందుకు బీఎల్వోలు క్షేత్రస్థాయిలో గుర్తించారు. కాగా, జిల్లాలో తొలగించేందుకు గుర్తించిన ఓట్లకు సంబంధించి ముసాయిదాను ప్రకటించిన అనంతరం నోటీసులు జారీ చేయనున్నారు. సంబంధిత ఓటర్లు సరైన రుజువులు చూపిస్తే జాబితాలో ఉంచి, మిగతా ఓట్లను ఆ జాబితా నుంచితొలగించనున్నారు.
ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమంతో జిల్లాలోని పట్టణ ఓటర్లు భారీగా తగ్గనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జిల్లాలో తొలగించేందుకు గుర్తించిన 2,10,842 ఓట్లలో చాలావరకు డబుల్ ఓట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో చాలావరకు ఓటర్లు సర్ ప్రక్రియకు గైర్హాజరయ్యారు. మున్సిపాలిటీలతోపాటు సొంతూర్లలో ఓటు హక్కు ఉన్న ఓటర్లు తమ స్వగ్రామాల్లోనే ఓటు హక్కు ఉంచుకునేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు.
జిల్లాలో 79.28 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్టు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. జిల్లాలో 10,17,671 ఓట్లు ఉండగా 8,06,829 ఓట్లకు సంబంధించి బీఎల్వోలు డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. పరిగి నియోజకవర్గంలో 2,76,260 ఓట్లు ఉండగా 2,23,369(80.85%) ఓట్లను ఆన్లైన్ చేయగా మిగతా ఓట్లను ఏఎస్డీగా గుర్తించారు. వికారాబాద్ నియోజకవర్గంలో 2,37,921 ఓట్లుండగా, 1,85,541(77.98%) ఓట్లను డిజిటలైజేషన్ చేశారు. తాండూరు నియోజకవర్గంలో 2,52,235 ఓట్లకుగాను 1,86,604 (73.98%) ఓట్లను కంప్యూటకరీంచగా.. కొడంగల్ నియోజకవర్గంలో 2,51,255 ఓట్లలో 2,11,315 ఓట్లను ఆన్లైన్ చేయగా మరో 39,940 ఓట్లను ఏఎస్డీ ఓట్లుగా గుర్తించారు.