బోధన్/కామారెడ్డి, ఆగస్టు 10: కేంద్ర ప్రభు త్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ప్రజా, కార్మిక సంఘాలతో పాటు వామపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. బోధన్, కామారెడ్డి, నవీపేట్, భీమ్‌గల్ తదితర ప్రాంతాల్లో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించడంతో పాటు దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్శక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని వారు ఆరోపించారు. మోదీ నాయకత్వంలో అమెరికాతో చేసుకున్న ఒప్పందం దేశ ప్రజానీకానికి నష్టం చేకూర్చేలా ఉందన్నారు.
బడా పారిశ్రామిక వేత్తలకు మేలు చేకూర్చేలా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం మానుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పింఛన్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బోధన్‌లో రాస్తారోకో కారణంగా రాకపోకలు స్తంభించాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. టీయూసీఐ నేత బండారు మల్లేశ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జెమ్మిశెట్టి శంకర్‌గౌడ్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పుట్ట వరదయ్య, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఏశాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.