సిద్దిపేట, ఆగస్టు 10: ఉద్యోగాల కోసం ఆందోళన చేపడుతామని బీఆర్ఎస్ హెచ్చరిస్తేనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారని ఆపార్టీ రాష్ట్ర నాయకులు పాలసాయిరామ్, ఎడ్ల సోమిరెడ్డి అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆధ్వర్యంలో కేసీఆర్ ఉచిత కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
గతంలో నిర్వహించిన కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ ద్వారా ఎంతోమంది కానిస్టేబుల్, గ్రూప్స్, టీచర్ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారని గుర్తు చేశారు. చదువుపై ఆసక్తి ఉండి కోచింగ్ సెంటర్లో ఫీజు చెల్లించలేని వారికోసం హరీశ్‌రావు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ల కోసం త్వరలో దరఖాస్తులు స్వీకరించి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తామని చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మోహిజ్, పాపయ్య, ఉప సర్పంచ్ల ఫోరం సిద్దిపేట అర్బన్ మండలం అధ్యక్షుడు నరేశ్, సర్పంచ్‌లు నరేందర్‌రెడ్డి, దేవయ్య, యువజన నాయకులు నరేందర్‌రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.