పాల్వంచ, మార్చి 25 : పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. 15 నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి దివాలా తీయించారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని తెలిపారు. పాల్వంచ లోని ఆయన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎందరో ముఖ్యమంత్రులను చూశానని, కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయి, హుందాతనాన్ని మరిచి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రంలో మంత్రులు ఒక మాట ఎమ్మెల్యేలు మరో మాట, సీఎం ఇంకోక మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నరన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారన్నారు. రైతు రుణమాఫీ ఒక బూటకం చేశారని, రైతు బంధు- రైతు బీమా పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. కాంగ్రెస్ పాలనను బీఆర్ఎస్ పాలనను ప్రజలు బేరిజు వేసుకుంటుంటున్నట్లు తెలిపారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, కాంగ్రెస్ కు ఎందుకు ఓట్లు వేశామా అని ప్రజలు లెంపలు వేసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ సింగిల్ గా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పండుగలంటే అనేక రకాల సహాయ సహకారాలు అందేవి. కానీ ఇప్పుడు రంజాన్ తోఫా ఎక్కడికి పోయిందని, క్రిస్టియన్స్ కు నూతన వస్త్రాల పంపిణీ ఎక్కడ? మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ ఏదీ అని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక దివాలాకోరుతనంగా ఉందని, అది ఒక అంకెల గారడి అన్నారు. పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన బడ్జెట్, రాష్ట్రంలో బీసీలకు పూర్తి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ సభను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతామాలక్ష్మి, పాల్వంచ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి, సీనియర్ నాయకులు కనగాల బాలకృష్ణ, మల్లెల రవిచంద్ర, కొత్వాల సత్యం, దాసరి నాగేశ్వరరావు, కాల్వ ప్రకాశ్, భూక్య చందునాయక్, సమ్మయ్య గౌడ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజుల, తెలంగాణ గిరి, ఆర్కే, నామా నవీన్, కుంపటి శివ, భూక్య విరన్న, బీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు దుర్గాప్రసాద్, కంచర్ల రామారావు, పత్తిపాటి శ్రీను, కొండలరావు, జగ్గు తండ సేవ్య, మస్తాన్, హబీబ్, గంగుల చంద్రశేఖర్, నవభారత్ ఆనంద్ పాల్గొన్నారు.