జూలూరుపాడు, మే 28 : రాష్ట్రంలో అన్నదాతలకు దుర్భర పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో కనుమరుగవడం ఖాయమని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రైతులకు ఉద్దేశపూర్వకంగానే సకాలంలో యూరియా సరఫరా చేయకుండా, విద్యుత్ కోతలు విధిస్తూ, కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న ఇబ్బందులతో విసిగిపోయిన రైతులు, తమ ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకునేలా ప్రభుత్వం పరోక్షంగా కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా తప్పించుకోవాలనేదే రేవంత్ రెడ్డి వ్యూహమని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పంట చేతికి రాగానే వెంటనే ధాన్యం కొనుగోలు చేసి, వారం రోజుల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధ పాలన వల్ల రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని దుయ్యబట్టారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.