– సిపిఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
పాల్వంచ, జనవరి 10 : అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, హామీలను అమలు చేస్తామని చెప్పి ఆర్పాటంగా ప్రకటించి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటికీ అతీగతీ లేదని సిపిఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. శనివారం పాల్వంచ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం మాట్లాడటం లేదని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బిల్లులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించకుండా హింస పెట్టడం ఎలా సరైందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రైతాంగానికి సరిపడా యూరియాను తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో యువత, మహిళలు, రైతులు, కార్మికులు అందరూ సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం దానిపై పెట్టకుండా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి స్థాయిని మర్చిపోయి వల్గర్ లాంగ్వేజ్ ని ఉపయోగించడం సరైంది కాదన్నారు.
దుమ్ముగూడెం నుండి నీటిని కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మొత్తానికి ఇవ్వాలని, ఇల్లెందు నియోజక వర్గానికి కూడా దుమ్ముగూడెం నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మతాలను కులాలను రెచ్చగొడుతుందని, సర్ పేరుతో ఓట్లు తొలగించి అన్ని రాష్ట్రాల్లో బిజెపి గెలవాలని చూస్తుందన్నారు. పౌరసత్వం పేరు మీద మైనారిటీలను బెదిరింపులకు గురిచేస్తుందన్నారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు, నూతన రైతు చట్టాలను ఎత్తివేయాలని రైతాంగం ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేజీ రామచంద్రన్, కె.రంగయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోకినపల్లి వెంకటేశ్వర్లు, చంద్ర అరుణ, చిన్న చంద్రన్న, ముద్ద భిక్షం, కల్పన, రాము, నాయని రాజు, జాటోత్ కృష్ణ, ధర్మ భాస్కర్, కిశోర్, గోనెల రమేశ్, రాయబారం వెంకటేశ్వర్లు, వేల్పుల రమేశ్, కల్లూరి పద్మ పాల్గొన్నారు.