వసంత ఆగమనం వనానికే కాదు, జీవనానికీ సంతసమే! వనంలో తరులు చివురులు తొడుగుతాయి. జీవనంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కొమ్మల్లో కోయిల కూకూలు.. గుమ్మాల్లో బంధుమిత్రుల పలకరింపుల ఎకోలు! కొత్తకుండలోని షడ్రుచుల ఉగాది పచ్చడికి.. పెనం మీద నేతిలో మునిగి తేలిన పోలెల పరిమళం తోడవుతుంది. పంచాంగంలోని గ్రహగతులు.. పురోగతి సాధించడానికి పురిగొల్పుతాయి. ఇలా కోటి ఉషస్సులతో ఆగమించిన ఉగాది అంటే ఇంతేనా… ఇంకెంతో ఉంది! ఈ పండుగను పెనవేసుకున్న సంప్రదాయాలు, ఆచారాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మన జీవనశైలికి ఉగాది ఎంత దగ్గరగా ఉందో తెలియజేస్తాయి.
కాలగమనంలో తెలుగు సంవత్సరాలు ఏడాదికి ఒకటి పలకరించే పర్వం ఉగాది పండుగ. ప్రతి పండుగ ఏదో ఒక దేవుడికి సంబంధించినదో, పురాణ గాథను అనుసరించి జరుపుకొనేదై ఉంటుంది. ఉగాది మాత్రం అందుకు భిన్నంగా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఆమని కోయిల రాగాలు, లేలేత చిగురాకుల సోయగాలు నూతన శోభతో అలరారే ప్రకృతి ఒడిలో జరుపుకొనే పర్వం ఇది. తెలుగునాట సంప్రదాయాల గుబాళింపుతో, షడ్రుచుల పరిమళాలతో నవ జీవన యాత్రకు సజీవ తార్కాణంగా విచ్చేసింది ఉగాది.

ఈ ఉగాది తెలుగునాట ఒక్కొక్కచోట ఒక్కోరీతిలో జరుపుకొంటుంటారు. అన్ని ఆచారాల పరమార్థం ఒక్కటే! తెలంగాణలో వ్యవసాయదారులకు, చేతి వృత్తుల వారికి ఉగాది ప్రత్యేకమైన పండుగ. పంచాంగంలో నవనాయకుల ఫలితాలు, కార్తెల ఆగమనాన్ని బట్టి ఈ ఏడాది వ్యవసాయ పనులు ఎప్పుడు మొదలుపెట్టాలో అంచనాకు వస్తారు రైతులు. అంతేకాదు, ఏడాదంతా ఫలప్రదంగా ఉండాలని కోరుతూ ఉగాది నాడు ఎడ్లను శుభ్రం చేసి, వాటి కొమ్ములకు ఆముదం రాసి, కొత్త పగ్గాలు వేసి, కానెలు పట్టి అయిటిపనికి పోతారు. మంచిరోజునాడు ఇంటి బలగాలం ఉన్న వ్యక్తి తూర్పు నుంచి పడమరకు సాగు చేయడం ఆనవాయితీ. బలగాలం అంటే.. ఇంట్లో ఉన్న మగవాళ్లందరి పేరు మీద ఆ యేడు మంచి చెడుల గురించి ఊరి పురోహితుని దగ్గర తెలుసుకుంటారు. అందరిలో బలం ఉన్న వారితో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టిస్తారు. అలా చేస్తే.. ఆ వ్యక్తికి ఉన్న గ్రహబలంతో ఆ యేడు సాగులో మంచి దిగుబడి వస్తుందని నమ్మిక. దీనినే తెలంగాణలో కొమ్మకొట్టిరావడం, ఆంధ్రలో దొంగేరు అనీ అంటారు.
రైతులతోపాటు వడ్రంగి, కుమ్మరి, స్వర్ణకారుల వారికీ ఉగాది ప్రత్యేకమైన పండుగ. ఉగాది ముందు అమావాస్య నాడు తమ వృత్తిలో ఉపయోగించే పరికరాలను శుభ్రం చేసి, వాటికి మోదుగపువ్వు, మామిడాకు కంకణాలు కట్టి పూజిస్తారు. మూడోనాడు వర్జ్యం లేకుండా చూసి ఊరిలో మంచిపేరుగల వ్యక్తికి ఏదైనా చిన్న వస్తువును చేసి అతని ద్వారా సంభావన పొందే సంప్రదాయం ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో కనిపిస్తుంది. ఈ విధానాన్ని ధాతి పూజగా పిలుస్తారు.
తెలంగాణలో ఉగాదికి మరో ప్రత్యేకత పోలెలు (భక్ష్యాలు). గోధుమపిండిలో, శనగపిండి, బెల్లంతో కలిపి చేసిన తీపి పదార్థం (పూర్ణం) కూరి.. చపాతీలా ఒత్తి పెనం మీద నెయ్యి వేసి దోరగా కాలుస్తారు. వీటిని మోదుగ ఆకులలో ఉంచి దేవుడికి నైవేద్యంగా సమర్పించి.. ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ రోజుల్లో పోలెలు ప్రతి వేడుకలోనూ కనిపిస్తున్నాయి. కానీ, ఉగాది సందర్భంగా చేసే భక్ష్యాలు తీసు కుంటే రానున్న వేసవిని తట్టుకునే శక్తి శరీరానికి కలుగుతుందని పెద్దల మాట.

ఉగాదికి సంబంధించి గ్రహచార (గోచార) ఫలితాలు తెలుసుకోడానికి పంచాంగ శ్రవణం ఓ మార్గం. అయితే, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని జాతులవారు ఒక దొప్పలో గోధుమగింజలు, కంకణాలు వేసి దేవుడి ముందు పెట్టి సాయంత్రం ఇంటి పెద్ద తలపాగా ధరించి తూర్పు దిక్కున కూర్చుని గోధుమగింజలతో సరి, బేసి విధానంలో మంచి, చెడులను నిర్ణయించడం కనిపిస్తుంది. నాయకపోడు గిరిజనులు ఉగాదికి ఐదు రోజుల ముందు శూలాల పండుగ చేసుకుని ఇప్పసారా తాగుతూ హుషారు చేసుకోవడం కనిపిస్తుంది.
ఉగాది నోము తర్వాత వసంతోత్సవం జరుపుకోవడం కొన్ని కుటుంబాల్లో ఆనవాయితీగా వస్తున్నది. ఉగాది మరుసటి రోజు కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరూ కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వసంతోత్సవం జరుపుకొంటారు. ఉగాది రోజే వ్యవసాయదారులు, చేతి వృత్తి పనివారు జీతగాళ్లను పనికి కుదుర్చుకుని వారికి కొత్త చెప్పులు, ధాన్యం, డబ్బులు ఇచ్చి విధుల్లోకి రమ్మని ఆహ్వానిస్తారు. రజకులు ఉగాది నాడు ఇళ్ల పంపకాలు చేసుకుని తమ వంతు కట్టడిని అమలు చేస్తారు. వివిధ జాతుల వారు తెలుగువత్సరాది ఉగాదిని తమ జీవనయానంలో శుభాగమనానికి ప్రారంభంగా భావిస్తారు. కాలాన్ని గౌరవిస్తూ నిర్వహించుకునే ఈ ఉగాది వేడుక తెలంగాణవాసులకు తొలి పర్వదినమైంది.
ఈ యేడాది పేరు పరాభవ. తెలుగు సంవత్సరాల్లో పరాభవ 40వది. మనలోని అరిషడ్వర్గాలను జయిస్తే పరాభవమన్నది ఉండదని ఈ ఉగాది సందేశమిస్తున్నది. పరాభవ అనగానే ఓడిపోవడం, అపజయం అనుకుంటున్నప్పటికీ.. బాహ్యప్రపంచంలో ఓడిపోవడం అనే కాదు. బయటి శత్రువుల కంటే మనలోని చెడు ఆలోచనలను ఓడించడానికి ఈ సంవత్సరం సరైనదని అర్థం. అహంకారాన్ని విడనాడి, సత్యం, ధర్మం వైపు సాగేవారికి ఈ సంవత్సరం గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుందని పంచాంగకర్తలు చెబుతున్నారు.
– రంగనాథ్ మిద్దెల