– అప్రోచ్, సైడ్బర్మ్ పనుల్లో నాణ్యత లేమి
– పనుల పరిశీలనలో కొరవడిన అధికారుల పర్యవేక్షణ
– గోదావరికి వరదొస్తే వారధి నిర్మాణ పనుల ఖర్చు వృథాయేనా?
– నెల రోజులు కావస్తున్నా కొత్త వారధిపై జరగని రాకపోకలు
బూర్గంపహాడ్, జూన్ 09 : పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో పది కాలాల పాటు ఉండాలన్న లక్ష్యంతో సారపాక- భద్రాచలం మధ్యలో కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త వారధికి ఇటీవల అప్రోచ్ కుంగి ఊడిపోవడంతో రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే నెల రోజులైనా ఈ అప్రోచ్ పనులతో పాటు సైడ్బర్న్ పనులు నత్త నడకన సాగుతున్నాయని వాహనదారులు, భక్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం అన్ని అడ్డంకులను అధిగమించి వినియోగంలోకి వచ్చిన ఈ వంతెనకు ఇటీవల నెల రోజుల క్రితం అప్రోచ్ కుంగి రాత్రికి రాత్రే ఊడిపోవడంతో అధికారులు అప్రమత్తమై నూతన వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. అయితే ఆనాటి నుంచి ఇప్పటివరకు ఆ పనులు ముమ్మరంగా చేపట్టకుండా నత్త నడకన సాగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. చేస్తున్న మరమ్మతు పనుల్లో సైతం నాణ్యత పాటించడం లేదనే వాదనలూ భక్తులు, వాహనదారుల నుండి లేకపోలేదు. అప్రోచ్, సైడ్ బర్క్ పనులకు వాడే మెటీరియల్ తో పాటు ఇతర సామగ్రిని నిబంధనలు పాటించకుండా నాణ్యత లేకుండా వాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వంతెన అప్రోచ్ పనులు జరుగుతుండడంతో కొత్త వారధి వైపు రాకపోకలు పూర్తిగా నిలిపివేసినప్పటికీ సరైన ప్రమాద సూచికలు రహదారిపై ఉంచకపోవడం, ఉంచినా రాత్రిళ్లు అవి అక్కడ లేకపోవడంతో భద్రాచలం వైపు వెళ్లే కార్లు, ఇతర వాహనాలు నూతన వారధి ఉన్న వైపు వెళ్తుండడం, ముందుకు వెళ్లాక మట్టి గుట్టలు కనిపించి ఆగి తిరిగి పక్క నుండి వెళ్తూ ప్రాణాలను రక్షించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెలియని వాహనదారులు ఆటువైపు వెళితే పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం లేకపోలేదు. రాత్రిళ్లు వాహనాలు అటువైపు వెళ్లకుండా ప్రమాద సూచికలు పెట్టి పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
భద్రాద్రి నూతన వంతెన అప్రోచ్ పనులు, సైడ్ బర్మ్ పనులను ఎన్హెచ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉండగా పనుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని పలువురు మండిపడుతున్నారు. పది కాలాల పాటు ఉండాల్సిన నూతన బ్రిడ్జి నిర్మాణ విషయంలో ఆది నుంచి సంబంధిత శాఖ అధికారులు ఇదే పద్దతిని పాటిస్తున్నారనే ఆరోపణలు సైతం లేకపోలేదు. పనుల పర్యవేక్షణ చేయని, పాటించని విషయంలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సంబంధిత అధికారులపై ఆగ్రహం సైతం వ్యక్తం చేశారు. ఆ సంఘటన జరిగిన కొన్ని నెలలకే వంతెన అప్రోచ్ కుంగిపోవడం… నెలరోజులైనా పనులు ముందుకు సాగకపోవడంపై ఇటు వాహనదారులు, అటు రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.

నత్త నడకన భద్రాద్రి ‘కొత్త వారధి’ పనులు
ప్రతి ఏడాది గోదావరి వరదలు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వస్తుంటాయి. భద్రాచలం- సారపాక నూతన వంతెన అప్రోచ్ కుంగిపోవడంతో నెల రోజులుగా మరమ్మతులు చేస్తున్నారు. అయితే పనులు నత్త నడకన సాగుతుండటంతో ఈ నెలాఖరు నుంచే వర్షాలు మొదలై ఎగువ ప్రాంతాల నుంచి గోదావరి వరదనీరు వచ్చి చేరితే అప్రోచ్ పనుల కోసం చేసిన లక్షల రూపాయల నిధులు నీళ్లపాలయ్యే అవకాశం లేకపోలేదని ఈ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. వరదలొస్తాయని తెలిసినా ఎన్హెచ్ అధికారులు గుత్తేదారులతో ఈ మరమ్మతు పనులు త్వరితగతిన చేపట్టకుండా జాప్యం చేయడంలో అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కొత్త వారధిపై వాహన రాకపోకలు జరగకపోయినా హైమాస్ లైట్లు వెలుగులు ఉంటున్నాయని… పాత వారధిపై కొన్ని లైట్లు వెలగడంలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. కొత్త వారధిపై లైట్లు వెలగకుండా చూసి పాత వారధిపై మరమ్మతులకు గురైన లైట్లు బాగుచేయిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి అప్రోచ్ పనుల్లో నాణ్యత పాటించేలా గుత్తేదారులను పర్యవేక్షించాలని, సరైన మెటీరియల్ వాడేలా చూడాలని, త్వరలో నూతన వారధిపై రాకపోకలు సాగేలా చూడాలని వాహనదారులు, భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.