వాషింగ్టన్, జూలై 25: విదేశీ వృత్తి నిపుణులకు జారీచేసే హెచ్1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధింపు విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఫీజులు చట్టబద్ధం కాదంటూ ఇటీవల దిగువ న్యాయస్థానం తీర్పుపై స్టే ఇచ్చేందుకు అప్పీల్స్ కోర్టు నిరాకరించింది. దీనిపై స్టే ఇవ్వకపోవడం వల్ల దేశానికి వచ్చే నష్టం ఏంటో తెలియజేయటంలో ట్రంప్ యంత్రాంగం విఫలమైందని పేర్కొన్నది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు దీనిపై నిర్ణయం తీసుకోలేరని పేర్కొన్నది. అమెరికా తాత్కాలిక వలస వీసా హెచ్1బీకి ఎంపికైన వారు లక్ష డాలర్ల ఫీజును చెల్లించాలని గత సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.
దీనిని సవాల్ చేస్తూ 20 రాష్ర్టాల్లోని అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన యూఎస్ డిస్ట్రిక్ కోర్టు..లక్ష డాలర్ల ఫీజు చట్ట విరుద్ధమని తీర్పు చెప్పింది. ఇదిలా ఉండగా, హెచ్1బీ వీసాలకు సంబంధించి ట్రంప్ యంత్రాంగం మరో బిల్లును తీసుకురావటం భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నది. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు టిమ్ షీహీ సెనెట్‌లో ప్రవేశపెట్టిన బిల్లులో..కొత్త హెచ్1బీ వీసాల జారీని మూడు సంవత్సరాలపాటు నిలిపివేయాలని ప్రతిపాదించారు. అంతేగాక ట్రంప్ యంత్రాంగం విధించిన లక్ష డాలర్ల ఫీజును చట్టబద్ధం చేయాలని పేర్కొన్నారు. ‘కొన్ని ప్రత్యేక పోస్టులను నిపుణులైన విదేశీయులతో భర్తీ చేసేందుకు ఈ హెచ్1బీ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చారు. అంతేగానీ అర్హత ఉండి కష్టపడి పనిచేసే అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు లభ్యమయ్యే విదేశీ కార్మికులను భర్తీ చేయడానికి కాదు’ అని సెనెటర్ టిమ్ షీహీ అన్నారు.