భువనగిరి అర్బన్, జూన్ 09 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భువనగిరికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పట్టణ పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చనందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తారనే భయంతో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీ.కిరణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఖాజా అజీమోద్ధిన్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు కాజం, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు పెంట నితీష్, నాయకులు నిలుగొండ శివ, గుజ్జ పవన్, సైదులు తదితరులను అక్రమంగా అరెస్టు చేసి భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులకు బెదిరేది లేదని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వాని సదా ప్రశ్నిస్తూనే ఉంటామని పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవి.కిరణ్ కుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.