జనగామ, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జనగామ నియోజకవర్గంలో తట్టెడు మట్టి తీయలేదు.. మూరెడు రోడ్డు వేయలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ జీరో అవర్‌లో జనగామ ప్రాంత సమస్యలపై గళమెత్తిన ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గణాంకాలతో సహా ఎండగట్టారు. నియోజకవర్గంలో 131 గ్రామాలు, 2 పట్టణాలు, 42 వార్డులు ఉన్నా అభివృద్ధి లేదన్నారు. గ్రామాల్లో ఆర్టీసీ బస్సు రవాణా సమస్య తీవ్రంగా ఉందని, రోజుకు కేవలం 2 ట్రిప్పులు మాత్రమే నడుస్తున్నాయని, జనగామ, సిద్ధిపేట, హుస్నాబాద్, హైదరాబాద్ డిపోల వద్ద కొత్త బస్సులు కోరితే రోడ్లు బాగాలేవని అధికారులు నడపడానికి నిరాకరిస్తున్నారన్నారు.
జనగామ-హుస్నాబాద్ ప్రధాన రహదారిలో గానుగపహాడ్ రోడ్డు బ్రిడ్జి మరమ్మతులకు రూ.90 లక్ష లు కోరినా ఆలస్యం చేసి చివరికి యువకులు ఆందోళన చేసి జైలు వెళ్లిన తర్వాతే నిధులు మంజూరయ్యాయన్నారు. చీటకోడూరు గ్రామానికి వెళ్లే రోడ్డు దయనీయస్థితిలో ఉందని, ఎంఆర్ఆర్ కింద మంజూరైనా పనులు ప్రారంభం కాలేని గ్రామ వాగుపై రోడ్డు వంతెన కోసం ప్రతిపాదన పంపినా ఫలితం లేదన్నారు. బండనాగారం నుంచి కటూర్, సుందరయ్యనగర్ నుంచి జనగామ, లద్దునూరు నుంచి వంగపల్లి రోడ్లకు రూ.13 కోట్లు మంజూరైనా రెండేళ్లుగా పనులు ప్రారంభం కాలేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
అలాగే హ్యామ్ కింద మంజూరు చేసిన 3 రోడ్లకు ఇప్పటికీ టెండర్లు పూర్తి కాలేదని, ముస్త్యాల నుంచి వడ్లకొండ, చేర్యాల నుంచి నాగపూరి, రేబర్తి నుంచి కొండాపూర్, పంచాయతీరాజ్ కింద 18 రోడ్లు మంజూరు చేసినా ఒక మీటర్ రోడ్డు కూడా వేయలేదని, ఇంకా టెండర్లు కూడా ప్రారంభం కాలేదన్నారు. జనగామ-దుద్దెడ హైవే పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, చేర్యాల పట్టణంలో రోడ్డు పనులు ఆగిపోయాయని, బచ్చన్నపేట వద్ద ప్రధాన రహదారి 2కిలోమీటర్లు పెద్దపెద్ద గుంతలు పడి ప్రమాదకరంగా ఉందని, చంపక్‌హిల్స్ హైవే పనులు నిలిచిపోయి కంకరతేలి కిలోమీటర్ మేరకు రోడ్డంతా దుమ్ము లేస్తున్నదన్నారు.
ఇదే మార్గంలో పలుచోట్ల నిర్మించిన సీసీతో కల్వర్టులు నిర్మించి మిగతా రోడ్డు తారుతో వేయడం వల్ల రోడ్డుకు, కల్వర్టుకు మధ్య వ్యత్యాసం ఉండడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సంబంధిత మంత్రి దృష్టికి తెచ్చారు. బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి ప్రాంతానికి బస్సులు లేక విద్యార్థులు ఇతర జిల్లాకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉందని, గజ్వేల్ నుంచి బచ్చన్నపేట మీదుగా హైదరాబాద్ మార్గంతోపాటు మద్దూర్, సలాఖ్‌పూర్, దూల్మిట్ట ప్రాంతాల్లో బస్సులను సగానికి తగ్గించారన్నారు. వెంటనే రోడ్ల పనులు ప్రారంభించి పూర్తి చేయడంతోపాటు హైవే రోడ్డు మరమ్మతులు చేసి బస్సుల సంఖ్య పెంచాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
వీర బైరాన్పల్లిగా నామకరణం చేయాలి..
తెలంగాణ సాయుధ పోరాటంలో సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరన్‌పల్లి గ్రామ ప్రజల ధైర్యసాహసాలను గౌరవిస్తూ వారి బలిదానాలను స్మరించేందుకు ఆ గ్రామానికి వీర బైరాన్పల్లిగా నామకరణం చేయాలని ఎమ్మెల్యే పల్లా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ మేరకు బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా బైరన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్ గ్రామాలను చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశాలుగా అధికారికంగా ప్రకటించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, బైరాన్పల్లిలోని ప్రసిద్ధ బురుజు సహా ఇతర చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని సూచించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియ జేసేలా పాఠ్యపుస్తకాలలో చేర్చాలని, ఈ ప్రాంతంలోని అమరవీరుల కుటుంబాలకు, ప్రాణాలతో బయటపడిన వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు.