– బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు
జూలూరుపాడు, ఏప్రిల్ 04 : గజ్వేల్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు తావులేదని ఆయన మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అనేది కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదు, అది ప్రభుత్వ ఆస్తి. దానిని ధ్వంసం చేయడం అంటే నేరుగా ప్రభుత్వ ఆస్తులను, ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మాజీ ముఖ్యమంత్రి, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయానికే రక్షణ లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో మనమంతా అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ దాడి ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయమని, పోలీసులు అలసత్వం వహించడం వల్లే దుండగులు రెచ్చిపోయారని విమర్శించారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి, కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు.