– జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పరిశీలన
జూలూరుపాడు, మే 29 : మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన దిగుబడిని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని, లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి నిల్వలను తనిఖీ చేశారు. గత రాత్రి కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో కేంద్రంలో ఉన్న మొక్కజొన్న నిల్వలు తడవకుండా తీసుకున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో ముందస్తుగానే టార్పాలిన్లతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టడం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలపడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం కేంద్రంలో నిల్వ ఉంచిన మొక్కజొన్న నాణ్యతను, తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం కేంద్రంలో 3,600 మొక్కజొన్న బస్తాలు నిల్వ ఉన్నాయని, వీటన్నింటినీ సాయంత్రంలోగా లోడింగ్ ప్రక్రియ పూర్తి చేసి తరలిస్తామని అధికారులు కలెక్టర్కు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్ని లారీలలో లోడింగ్ ప్రక్రియ జరిగింది, ఇప్పటివరకు ఎంత మొత్తంలో మొక్కజొన్నను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 28 వేల బస్తాలను గోదాములకు తరలించినట్లు అధికారులు నివేదించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట జూలూరుపాడు తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రవి, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మార్కెటింగ్, సివిల్ సప్లయ్ శాఖల అధికారులు ఉన్నారు.