చట్టాన్ని గౌరవిస్తామని చెప్పిన పాలకులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. ప్రతినెలకోసారి సమావేశం నిర్వహించి ప్రజాసమస్యలపై చర్చించాలని ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. వాటిని తుంగలో తొక్కుతున్నారు. దీనివెనుక లోతుగా పరిశీలిస్తే అక్రమాల కోణం దాగి ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమావేశాలు లేవన్న పేరుతో ఎలాంటి కౌన్సిల్ అనుమతులు లేకుండానే పెండింగ్ అప్రూవల్ ఇస్తుండగా, దీని వెనుక పెద్ద తతంగమే దాగి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నగరంలో పేరుకుపోతున్న సమస్యలపై కార్పొరేటర్లు తమ గోడు వినిపిద్దామంటే.. వేదిక లేకుండా పోతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రతినెలా సమావేశం నిర్వహించని పాలకవర్గంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ కార్పొరేటర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ సీడీఎంతోపాటు కలెక్టర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం ప్రస్తుతం బల్దియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 11 : మున్సిపల్, కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి.. (జీవోఎంఎస్ నెంబర్ 216 ఎంఏ యూడీ తేదీ : 22/12/2021ని అసునరించి) ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. మున్సిపల్, కార్పొరేషన్ కౌన్సిల్లో కార్యకలాపాల నిర్వహణ నియమావళి పేరుతో 2021లో పలు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ప్రతినెలా సమావేశాలు నిర్వహించడంతోపాటు అందులోని ఎజెండా అంశాలు, మీటింగ్, తదుపరి చేయాల్సిన కార్యకలాపాల వంటి అంశాలను పూర్తిగా సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ, ఇందులో మెజార్టీ నిబంధనలను ప్రస్తుత పాలకవర్గం అమలు చేయడం లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వ్యక్తమవుతున్నాయి.
సమావేశంలో సమావేశపు మినిట్స్‌ను నమోదు చేయడంతోపాటు.. సదరు మినిట్స్‌పై సమావేశం జరిగిన వెంటనే, ఒక రోజుకు మించకుండా చైర్పర్సన్ లేదా మేయర్ లేదా కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు సంతకం చేయాలని పేర్కొంది. ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే కమిషనర్ సదరు మినిట్స్‌పై 24 గంటల్లోపు సంతకం చేయాలి. సమావేశం జరిగిన తేదీ నుంచి మూడు రోజులలోపు, సమావేశపు కార్యకలాపాల కాపీలను ఉన్నతాధికారులకు పంపాలి. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయపు నోటీసు బోర్డుకు అతికించాలి. కానీ, ఇది జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెలా కనీసం ఒక్కసారైనా, నిర్ణయించిన రోజుల్లో సమావేశం నిర్వహించాలి. అలాగే, కౌన్సిల్ లేదా కార్పొరేషన్ మొత్తం సభ్యులలో 50 శాతం కంటే తక్కువ కాకుండా సమావేశం ఏర్పాటు చేయాలని కోరితే.. నిర్వహించాల్సి ఉంటుందని కూడా నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. మిగిలిన సమయాల్లో మూడు రోజులు ముందుగానే సమాచారం ఇచ్చి సమావేశం నిర్వహించాలి. సమావేశ నిర్వహణ ఎజెండా అంశాల ప్రకారం మాత్రమే ఉండాలి. అంతేకాదు, పాలకవర్గ సభ్యులు మాట్లాడే ప్రతీ అంశాన్ని రికార్డింగ్ చేయాలన్న నిబంధన ఉంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతి పెద్ద నగరం, కార్పొరేషన్ అయిన కరీంనగర్ నగరపాలక సంస్థలో సర్వసభ్య సమావేశం జరిగి మూడు నెలలు అవుతున్నా.. ఇప్పటి వరకు మరో సమావేశం నిర్వహించడం లేదు. ప్రతినెలా నిర్వహించాలన్న స్పష్టమైన నిబంధన ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. చట్టాన్ని గౌరవిస్తామని పదే పదే చెప్పిన బీజేపీ.. ఇప్పుడు అదే చట్టానికి తూట్లు పొడుస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి నగరంలో అనేక సమస్యలు పేరుకుపోయాయి. అంతేకాదు.. చాలా మంది కొత్తగా కార్పొరేటర్లుగా గెలిచారు. వారు తమ డివిజన్లోని సమస్యలను ప్రస్తావించాలన్నా, వాటికి పరిష్కారం కనుక్కోవాలన్నా, అధికారులతో పనులు చేయించుకోవాలన్నా.. వారికి ఒకే ఒక వేదిక కౌన్సిల్ సమావేశం. అది కూడా మూడు నెలలైనా నిర్వహించకుండా ఉండడం వల్ల సదరు కార్పొరేటర్లు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
అలాగే, నగరంలో పలు డివిజన్ల నుంచి వివిధ సమస్యలపై వస్తున్న ఫిర్యాదులపై చర్చించాల్సిన పాలకవర్గం వాటిని విస్మరిస్తోంది. మరో వైపు నగరంలో వివిధ అభివృద్ధి పనులు, ఇతర పనుల నిర్వహణకు మాత్రం పెండింగ్ అనుమతులు గుట్టు చప్పుడు కాకుండా ఇస్తున్నారని తెలుస్తోంది. ప్రతి నెలా సమావేశం పెడితే.. సదరు వ్యక్తులు అనుకున్న పనులుగానీ, పెండింగ్ పనుల పే రుతో అనుమతు లు ఇవ్వడం గానీ కుదిరే అవకా శం ఉండదు. తద్వారా వారి స్వప్రయోజనాలు నెరవేరకుండా పోతా యి. అంటే.. సమావేశాలు నిర్వహించకపోవడం వెనుక పెండింగ్ అనుమతు ల తతంగం పెద్ద మొత్తంలో దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. నిబంధనల ప్రకారం నగరపాలక సంస్థ పరిధిలో ఏ పనులు చేపట్టాల్సి ఉన్నా ముందుగా పాలకవర్గ సర్వసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ, ముందుగానే అనేక పనులకు పెండింగ్ అనుమతులు ఇస్తూ.. వాటిని ఎప్పుడో ఒకసారి ఏర్పాటుచేసే కౌన్సిల్ సమావేశంలో మమ అనిపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విధానం వల్ల అనేక పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్ నగరపాలక సంస్థలో గత మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకపోవడంపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్‌సింగ్ మంగళవారం కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)తో పాటు కలెక్టర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. తెలంగాణ మున్సిపాలిటీల్లో పాలనా వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన 2021 నిబంధనల ప్రకారం కనీసం ప్రతినెలా ఒకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, మున్సిపల్ వ్యవహారాలపై చర్చించాల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రస్తుతం చర్యలు తీసుకోవడం లేదని అందులో పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య పాలనా విధానానికి విరుద్ధమని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంపై పలుమార్లు మౌఖికంగా కోరినప్పటికీ అధికారులు స్పందించలేదని పేరొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించే వేదిక లేకుండా పోతుందన్నారు. దీనిని పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన జరిగితే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.