Vettuvam | ‘మద్రాస్’, ‘కబాలి’, ‘సార్పట్ట పరంపర’, ‘తంగలాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రసిద్ధ దర్శకుడు పా. రంజిత్, ఇప్పుడు సరికొత్త జానర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా వెట్టువం(Vettuvam). ఈ సినిమా నుంచి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ వెలువడింది. మునుపెన్నడూ చూడని సరికొత్త, వినూత్నమైన భవిష్యత్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ‘వరల్డ్ ఆఫ్ వెట్టువం’ (WorldofVettuvam) పేరుతో రూపొందించిన ప్రత్యేక పరిచయ వీడియోను రేపు (సెప్టెంబర్ 18న) మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రతిష్టాత్మక పోస్ట్-అపోకలిప్టిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ హీరో ఆర్య, అట్టకత్తి దినేష్, శోభితా ధూళిపాళ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తూ స్క్రీన్‌ను పంచుకోనున్నారు. రంజిత్ సినిమాల్లో సంగీతం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో తెలిసిందే, ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన బాణీలు సమకూరుస్తున్నారు. విభిన్న కాలమానాలతో కూడిన కథాంశంతో, సైన్స్ ఫిక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొనగా, రేపు రానున్న గ్లింప్స్ వీడియో ఆ అంచనాలను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.