ఉద్యోగం వచ్చిందని మురిసిపోయారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగమైనా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని విధుల్లో చేరారు. ‘కొన్నేళ్లకైనా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకపోతుందా?’ అనే ఆశతో ఉద్యోగం చేస్తూ వచ్చారు. వేతనాలు ఇవ్వకున్నా ‘ప్రభుత్వ ఉద్యోగమే కదా.. ఎప్పటికైనా ఇస్తుందిలే’ అనే నమ్మకంతో పనిచేస్తూ పోయారు. కానీ.. వారి నమ్మకాలను, వారి ఆశలు కాంగ్రెస్ సర్కారు నట్టేట ముంచింది. ఉద్యోగం వచ్చిందన్న మురిపాన్ని మూణ్నాళ్ల ముచ్చట చేసింది. ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే కొలువు నుంచి వెళ్లగొట్టింది. ఆర్థిక శాఖ ఆమోదం లభించలేదంటూ ఉద్యోగాల నుంచి బలవంతంగా తొలగించింది.
పైగా, చేసిన పని కాలానికి వేతనాలు కూడా ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. ఖమ్మం జిల్లాలో ఐదుగురు అవుట్ సోర్సింగ్ వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)లను బలవంతంగా తొలగించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఉద్యోగాలు లేకుండా చేసి తమ బతుకులను వీధిన పడేసిందంటూ బాధిత ఏఈవోలు గోడుమంటూ ‘నమస్తే తెలంగాణ’ను ఆశ్రయించారు. ఉద్యోగాలు కోల్పోయిన ఏఈవోల దీనగాథపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.
-రఘునాథపాలెం, ఆగస్టు 11
కర్షకుల కష్టాన్నే తమ కష్టంగా భావించారు. అన్నదాతలకు సేవ చేయడాన్నే అదృష్టంగా భావించారు. జీతం రాకున్నా ఓర్చుకున్నారు. అప్పులు చేసి మరీ కుటుంబాన్ని పోషించుకున్నారు. కానీ, విధులకు మాత్రం క్రమం తప్పకుండా హాజరయ్యారు. ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వాటన్నింటినీ ఖాతరు చేయకుండా అన్నదాతలతో మమేకమయ్యారు. కీలకమైన ఉద్యోగంగా భావించి ఎన్నో ఆశలతో విధులు నిర్వహించారు. అలా ఎంతో త్రికరణ శుద్ధితో పనిచేసిన ఏఈవోలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించింది. ఖమ్మం జిల్లాలో 129 వ్యవసాయ క్లస్టర్లున్నాయి.
వాటిల్లో కొన్ని ఖాళీగా ఉండడంతో కొంతమందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిన ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో భాగంగా ఖమ్మం జిల్లాలోనూ పలు విడతలుగా ఏడుగురు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంది. వారికి రెగ్యులర్ ఉద్యోగులతోపాటు విధులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. రైతుబీమా, పంటల నమోదు, పీఎం కిసాన్ వంటి పనులను సీజన్ల వారీగా కేటాయించి చేయించుకుంటూ వచ్చింది. ఉద్యోగం వచ్చిందనే సంబురంతో ఏఈవోలు.. ప్రభుత్వం తమకు కేటాయించిన పనులన్నీ సుమారు ఏడాదిపాటు సంతోషంగా చేసుకుంటూ వచ్చారు. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో అకస్మాత్తుగా వారిని విధుల్లోంచి తప్పించింది.
ఆర్థిక శాఖ ఆమోదం లేదంటూ ఒక కారణం, ఏఈవోలు అదనంగా ఉన్నారంటూ మరో కారణం చూపుతూ ఉద్యోగం నుంచి తొలగించింది. ఆకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించడం సదరు ఏఈవోలను ఆందోళనకు గురిచేసింది. వాస్తవానికి, విధుల్లో చేరినప్పటి నుంచి ప్రతి నెలా జీతం సక్రమంగా ఇవ్వకున్నా తాము ఎంతో బాధ్యతగా ఉద్యోగం చేశామని బాధిత ఏఈవోలు వాపోతున్నారు. ఫిబ్రవరిలో తమను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు రావాల్సిన వేతనాలను ఇప్పటికీ ఇవ్వకుండా తిప్పించుకుంటోందని మండిపడుతున్నారు. చేసిన పని కాలానికి వేతనాలు ఇప్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, అప్పటి కలెక్టర్ అనుదీప్‌ను, డీఏఈవోను, వ్యవసాయ శాఖ కమిషనర్లను కలిసి వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయి వేతనాలను ఇవ్వడంతోపాటు తిరిగి తమను విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఉద్యోగం రావడంతో కుటుంబానికి ఆసరాగా ఉంటానని మా తల్లిదండ్రులు సంబురపడ్డారు. కానీ, విధుల నుంచి తొలగించడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కుటుంబపరంగా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. జిల్లాలో ప్రస్తుతం 20 క్లస్టర్లకు ఏఈవోలు లేరు. అదనంగా ఏఈవోలు ఉన్నారనే సాకుతో మమ్మల్ని తొలగించారు. మేము చేసిన పని కాలానికి వేతనం కూడా ఇవ్వలేదు. వేతనాల కోసం ఆరు నెలలుగా మంత్రులు, కలెక్టర్, వ్యవసాయ అధికారులను కలిసి మొర పెట్టుకున్నాం. అయినా ప్రయోజనం లేదు. మాకు తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలి.
-జీ.మనోజ్, మల్లవరం పూర్వ ఏఈవో
ఏఈవోగా ఉద్యోగం రావడంతో అన్నదాతలకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావించా. గర్భవతిగా ఉన్న సమయంలోనూ కర్షకుల కోసం ఇష్టంగా విధులు నిర్వహించా. ఇటీవల అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించారు. చేసిన పని కాలానికి వేతనాలు కూడా ఇవ్వలేదు. జీతం కోసం ఆరు నెలలుగా తిరుగుతున్నాం. ప్రస్తుతం ఆ డబ్బు నాకు, నా బిడ్డ సంరక్షణకు ఎంతో అవసరం. ప్రభుత్వం నా పరిస్థితిపై ఆలోచన చేసి వేతనాలను ఇప్పించాలి. తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.
– టీ.స్వప్న, కల్లూరు పూర్వ ఏఈవో