– అలంకార ప్రాయంగా బయోమెట్రిక్ యంత్రాలా? అధికారులకు నిలదీత
– విద్యార్థుల వసతులపై నిర్లక్ష్యం, కుళ్లిన కూరగాయలపై ఆగ్రహం
జూలూరుపాడు, మార్చి 31 : ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. మంగళవారం జూలూరుపాడు మండలంలోని పలు విద్యా సంస్థలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆహార నాణ్యత, మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన కలెక్టర్ లోపాలను చూసి అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మొదటగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) & జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్ నేరుగా 8వ తరగతి గదిలోకి వెళ్లారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా విద్యార్థుల చేత ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలను చదివించి వారి పఠన సామర్థ్యాన్ని పరీక్షించారు. సిలబస్ పూర్తిపై వివరాలు ఆరా తీశారు.
పాఠశాల ఆవరణలో ఉన్న ఆర్.ఓ (R.O) ప్లాంట్ పనిచేయక పోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చుతో మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా బయట నుండి నీటిని ఎందుకు తెప్పిస్తున్నారని, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తారా? అని ప్రశ్నించారు. వారం రోజుల్లోగా ప్లాంట్ను బాగు చేయాలని డెడ్లైన్ విధించారు. అలాగే చేతులు కడుక్కునే చోట ట్యాపులు లేకపోవడం, నిర్వహణలో లోపాలపై సిబ్బందిని వివరణ కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ అంకిత్ మెరుపు తనిఖీలు
అనంతరం పడమటి నర్సాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ కు దిగ్భ్రాంతి కలిగించే దృశ్యాలు కనిపించాయి. కిచెన్, స్టోర్ రూమ్లను పరిశీలించగా వంట కోసం ఉంచిన కూరగాయలు కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటాన్ని గమనించారు. “విద్యార్థులకు ఇలాంటి ఆహారాన్ని వడ్డిస్తారా?” అంటూ అధికారులపై నిప్పులు చెరిగారు. వెంటనే ఆ కూరగాయలను పారేయించి, తాజా కూరగాయలను మాత్రమే వాడాలని ఆదేశించారు. మెనూలో బీట్రూట్ వంటి పోషక విలువలున్న కూరగాయలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
పాఠశాలలో బయోమెట్రిక్ యంత్రాలు మూలకు పడి ఉండడంపై కలెక్టర్ స్పందించారు. “ఇవి కేవలం గోడలకు అలంకారానికేనా? పని చేయనప్పుడు వీటిని ఉంచడం ఎందుకు?” అని ప్రశ్నించారు. వెంటనే వాటికి మరమ్మతులు చేయించాలని, లేనిపక్షంలో తొలగించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందాల్సిన యూనిఫాంలు, స్పోర్ట్స్ కిట్ల పంపిణీపై ఆరా తీశారు.
”విద్యార్థుల ఆరోగ్యం, విద్య విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కలెక్టర్ అన్నారు. అనవసర ఖర్చులు తగ్గించి, ఆ నిధులను విద్యార్థుల సౌకర్యాలకే వెచ్చించాలని సూచించారు. మెనూ పాటించకపోయినా, పరిశుభ్రతలో నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట తాసీల్దార్ శ్రీనివాస్, ఇన్చార్జి ఎంపీడీఓ తాళ్లూరి రవి, మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్, ఎస్ ఓ పద్మజ, ప్రధానోపాధ్యాయురాలు సుభద్ర, విద్యాశాఖ అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ అంకిత్ మెరుపు తనిఖీలు