జూలూరుపాడు ఫిబ్రవరి 24 : వాతావరణం ఒక్కసారిగా మారిపోయి కురిసిన అకాల వర్షం మిర్చి రైతుల పాలిట శాపంగా మారింది. చేతికొచ్చి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న పంట కల్లాల్లోనే తడిచి పోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే నీటిపాలవుతుంటే గుండెలు బాదుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని గుండెపూడి, అనంతారం, కాకర్ల, బేతాళపాడు, పాపుకొల్లు తదితర గ్రామాల్లో రైతులు తమ మిరప పంటను కోసి ఎండబెట్టేందుకు కల్లాల్లో ఆరబోశారు. వాతావరణం అనుకూలంగానే ఉందని భావించిన తరుణంలో ఊహించని విధంగా కురిసిన వర్షానికి ఆరబోసిన మిరపకాయలు పూర్తిగా తడిచి ముద్దయ్యాయి.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగుపరుగున వెళ్లి టార్పాలిన్లు, కవర్లు కప్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, రాత్రింబవళ్లు కష్టపడి పండించిన మిర్చి ఇలా అకాల వర్షార్పణం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వర్షానికి తడవడంతో మిర్చి రంగు మారిపోతుందని, నాణ్యత దెబ్బతిని మార్కెట్లో కనీస ధర కూడా దక్కదనే భయంతో కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు ఈ నష్టంతో ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కల్లాల్లో తడిసిన మిర్చిని పరిశీలించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

అకాల వర్షం.. కల్లాల్లోనే తడిసిన మిర్చి