ఇల్లందు మార్చి 26: యువత మాదకద్రవ్యాలు, ఆన్లైన్ బెట్టింగులకు దూరంగా ఉండాలని డీఎస్పీ ఎన్.చంద్రభాను అన్నారు. గంజాయికి అలవాటు పడి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. టేకులపల్లి మండలం గోలియా తండా గ్రామపంచాయతీ పరిధి బి కాలనీ తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్‌లో భాగంగా బుధవారం ఉదయం స్నిపర్ డాగ్‌తో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఐపీఎల్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పాల్పడితే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం వాహన తనిఖీ నిర్వహించగా ఎలాంటి ధృవ పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలు, ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్, ఎస్ఐ పోగుల సురేష్, ఎస్ఐ పొడి శెట్టి శ్రీకాంత్, ఆళ్లపల్లి ఎస్ఐ రతీష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.