- సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా డిమాండ్
జూలూరుపాడు, మే 27 : కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా పెంచిన చమురు ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ డిమాండ్ చేసింది. జూలూరుపాడు మండల కమిటీ సమావేశం బుధవారం తోటకూరి నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి జె.కృష్ణ, మండల కార్యదర్శి బానోతు ధర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మార్కెట్ సాకుతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విచ్చలవిడిగా పెంచుకుంటూ పోవడం వల్ల సామాన్యుడిపై మోయలేని భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
చమురు ధరల పెరుగుదల ప్రభావం రవాణా రంగంపై పడి, తద్వారా నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం పొంచి ఉందని నేతలు హెచ్చరించారు. ఎగుమతులు, దిగుమతులపై పన్నుల భారం పడటం వల్ల అశేష ప్రజాబాహుళ్యం ఆర్థికంగా కుంగిపోతోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పోటీపడి మరీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి, రైతులకు సకాలంలో అందాల్సిన ఎరువుల సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడుతోందని, అలాగే ఎరువుల ధరలు కూడా అదుపు తప్పాయని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వాల వైఫల్యాల వల్ల సాగు వ్యయం పెరిగి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి, పెంచిన చమురు, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని, పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకుడు ఎదలపురం గోపాలరావు, మండల నాయకులు లింగాల వీరభద్రం, ధనమంతరావు, రాయల సీదు, కుంచపు జమలయ్య, తోటకూరి శేఖర్, కల్తీ శేఖర్ పాల్గొన్నారు.