– కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి వినతిపత్రం అందజేత
కొత్తగూడెం సింగరేణి, జూలై 04 : ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి మనుగడకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని బిజెపి భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని కలిసి సింగరేణి మనుగడతో పాటు ఆర్థిక పరిస్థితు మెరుగుపరచాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సింగరేణి మనుగడ, సంస్థ ఆర్థిక బలోపేతం, కొత్త బొగ్గు గనుల కేటాయింపు వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుండి రావాల్సిన సుమారు రు.56 వేల కోట్ల బకాయిల వసూళ్లు చేసే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా తాడిచెర్ల బొగ్గు బ్లాక్–II, మణుగూరు పీకే ఓసీ–II డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులను సింగరేణికి కేటాయించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇల్లెందు పూసపల్లి ఓసీ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించేలా సింగరేణి యాజమాన్యానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
తాడిచెర్ల బొగ్గు బ్లాక్–IIలో సుమారు 277 మిలియన్ టన్నుల, మణుగూరు పీకే ఓసీ–II డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులో సుమారు 215 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. అయితే ఈ గనులను సింగరేణికి కేటాయించడం ద్వారా సంస్థ భవిష్యత్‌ను మరింత బలోపేతం కావడంతో పాటు వేలాది మంది కార్మికుల ఉపాధికి శాశ్వత భరోసా లభిస్తుందని వివరించారు. మణుగూరు ప్రాంతంలో ప్రస్తుతం కొనసాగుతున్న గనుల్లో బొగ్గు నిల్వలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, పీకే ఓసీ–II డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు సింగరేణికి దక్కడం అత్యంత అవసరమని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఫైనాన్షియల్ బిడ్ వేలంలో సింగరేణి తప్పనిసరిగా పాల్గొనేలా ఆదేశాలు జారీ చేసి, వేలం ద్వారా ఆ గనిని సింగరేణికే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.