రుద్రంపూర్, మే 04 : కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. ప్రతి కాలనీ భద్రత పోలీసులకు మాత్రమే పరిమితం కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత అవసరం అని, సీసీ కెమెరాలు ఉంటే దొంగతనాలు, అనుమానాస్పద కదలికలు, రాత్రివేళల్లో జరిగే అక్రమ కార్యకలాపాలను ముందుగానే గుర్తించి అరికట్టవచ్చు అని తెలిపారు. సోమవారం కార్పొరేషన్ పరిధిలోని ఎస్సీబీ నగర్ కాలనీవాసులకు నిర్వహించిన సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న నేరాల నేపథ్యంలో కాలనీల భద్రతను బలోపేతం చేయాల్సిన అవసరం అత్యవసరంగా మారిందన్నారు. ఈ క్రమంలో రామవరం ఎస్సీబీ నగర్ వాసులు ఆదర్శప్రాయంగా ముందుకొచ్చి భద్రతపై చైతన్యాన్ని ప్రదర్శించారని తెలిపారు.
అదే విధంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించడానికి సీసీ ఫుటేజీ కీలక ఆధారంగా ఉపయోగ పడుతుందని చెప్పారు. పోలీస్-ప్రజల సమన్వయం బలంగా ఉంటేనే కాలనీల్లో సంపూర్ణ భద్రత సాధ్యమవుతుందన్నారు. సీఐ మాటలకు ప్రేరణ పొందిన కాలనీ వాసులు ఉత్సాహంగా స్పందించారు. భద్రతపై తమ బాధ్యతను గుర్తిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించారు. కేవలం గంటలోనే రూ.60,000/- సమీకరించడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా కాలనీ భద్రతకు ప్రజలే ముందుండి చర్యలు తీసుకుంటే ఎంతటి మార్పు సాధ్యమో మరోసారి స్పష్టమైందన్నారు. ఇదేవిధంగా అన్ని కాలనీ వాసులు ముందుకు వస్తే నేర నియంత్రణలో భాగస్వామ్యం కావచ్చు అన్నారు.