రుద్రంపూర్, ఏప్రిల్ 09 : సింగరేణి సంస్థ లాభాల వెనుక కాంట్రాక్ట్ కార్మికుల చెమట చుక్కలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి పట్ల కొనసాగుతున్న వివక్ష తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో వారు లేని విభాగం అంటూ లేకుండా పోయింది. బెల్ట్ క్లీనింగ్, యాడ్ క్లీనింగ్, రోడ్డు క్లీనింగ్, సేల్ పికింగ్, సివిల్ వాటర్ సప్లై, పారిశుధ్య పనులు, హౌస్ కీపింగ్, స్టోర్స్ వంటి అనేక విభాగాల్లో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. పనుల వరకు అనేక విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులు ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల్లో సుమారు 604 మంది కాంట్రాక్ట్ కార్మికులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండే ఎండలోనే పనిచేస్తున్నారు. మైనింగ్ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వారి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అయినప్పటికీ వారికి చల్లటి తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కూడా అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వేసవి తీవ్రత దృష్ట్యా యాజమాన్యం శాశ్వత కార్మికులకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తుండగా, అదే పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను విస్మరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో ఇచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా నిలిపి వేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. పక్కనే శాశ్వత కార్మికులు మజ్జిగ తీసుకుంటుండగా, తాము చూస్తూ ఉండాల్సి రావడం బాధాకరమని కాంట్రాక్ట్ కార్మికులు వాపోతున్నారు. “మేము కూడా సంస్థ అభివృద్ధికి భాగస్వాములమే. అయినప్పటికీ మమ్మల్ని సాటి మనుషులుగా కూడా చూడడం లేదు” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
లాభాల్లో ఒక్కొక్క కార్మికుడికి రూ.5 వేల బోనస్‌లు ఇచ్చామని చెప్పుకునే నాయకులు, రూ.10 విలువ చేసే మజ్జిగ ప్యాకెట్‌ను కాంట్రాక్ట్ కార్మికులకు అందించలేక పోవడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం అని కార్మిక సంఘ నాయకులు విమర్శిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ లేకపోతే సింగరేణిలో అనేక పనులు నిలిచిపోతాయి. అయినప్పటికీ వారిని నిర్లక్ష్యం చేయడం అన్యాయం అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రస్తుత పని సమయాల్లో విధులు నిర్వర్తించడం కష్టంగా మారిందని కార్మికులు చెబుతున్నారు. ఇటీవల వడదెబ్బకు గురైన ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం అమలు చేసే విధంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షిఫ్టులను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కాంట్రాక్ట్ కార్మికులు కూడా మనుషులే అన్న భావనతో, చల్లటి తాగునీరు, నీడ, ఓఆర్ఎస్, మజ్జిగ వంటి కనీస సౌకర్యాలు వెంటనే కల్పించాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి వివక్షను తొలగించి సమానత్వంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.