నమస్తే నెట్వర్క్, ఆగస్టు 17 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధాన రహదారులపై రాస్తారోకోలు సైతం నిర్వహించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఆయా తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు కూడా అట్టహాసంగా జరుపుకోవాలని, వారి కళ్ళల్లో ఆనందం చూడాలన్న గొప్ప ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తులం బంగారం’ ఇవ్వలేక అడ్డదారిలో కోర్టుల ద్వారా అసలు మొత్తానికే పథకాలనే నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లలను అడ్డుకుంటారా అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాన్ని నిలిపివేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికభరోసా కల్పిస్తున్న పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
హైకోర్టులో దాఖలైన కేసు నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే న్యాయపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి అధికారంలోకి తెస్తే చివరకు ఓట్లేసిన ప్రజలనే మోసం చేస్తున్నదని విమర్శించారు. అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, భద్రాచలంలో పార్టీ నేతలు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, ఇల్లెందు సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్, కొత్తగూడెంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఖమ్మంలో నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి తదితర నాయకులు నిరసనల్లో పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను సంక్షభంలోకి నెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో వారి తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించేందుకే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చారు. ప్రతి పేద యువతి వివాహానికీ రూ.1,00,116ను మేనమామ కానుకలాగా ఇవ్వడంతో వారు ఎంతో సంతోషించేవారు. వారి తల్లిదండ్రులకు కూడా తమ బిడ్డల వివాహం అంత ఆర్థిక భారంగా అనిపించేది కాదు. ఎంతోమంది పేదలకు ఆసరాగా నిలిచిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. హైకోర్టులో కౌంటర్ వేయకపోవడమే అనుమానాలకు తావిస్తోంది.
-పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అందించాల్సిన సాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఈ పథకాలను నిలిచిపోయేలా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుండడంతో పేద కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమ బిడ్డ వివాహం పేదింటి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అనే అద్భుత పథకాలను తెచ్చారు. పేద కుటుంబాలకు ఇవి ఎంతో అక్కరకొచ్చాయి. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వల్లే పేద కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉంది. రెండున్నరేళ్లుగా తులం బంగారం హామీని విస్మరిస్తున్నారు.
-నామా నాగేశ్వరరావు, ఖమ్మం మాజీ ఎంపీ