హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో ‘ఆకర్ష్’ రాజకీయాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం గట్టి వార్నింగ్ ఇచ్చింది. అడ్డగోలుగా పార్టీల గోడలు దూకే జంప్ జిలానీలకు షాక్ ఇచ్చింది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో దానం అనర్హతపై హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో కారు దూకిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకూ ఉచ్చు బిగిస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు ఒక దానంకే పరిమితం కాదని, కాంగ్రెస్‌లోకి వెళ్లిన మిగిలిన ఎమ్మెల్యేల కేసులపైనా ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ వైపు అడుగులు వేసిన ఎమ్మెల్యేల వ్యవహారంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసులో తీర్పు కీలక మలుపు కానున్నది.
కాంగ్రెస్ తరఫున 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌ను 2024 ఏప్రిల్ 23 నుంచే తెలంగాణ అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టయింది. హైకోర్టు ఆయన స్థానాన్ని ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్, ఎన్నికల సంఘానికి ఆదేశాలు పంపింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణం లేదని స్పష్టం చేయడంతో దానం కేసుకు మరింత స్పష్టత వచ్చింది.
దానం కేసు నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపూ మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులపైనే పడింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్ల విషయంలో ఇప్పటికే స్పీకర్ నిర్ణయం వెలువడింది. వాటిలో పలు పిటిషన్లను స్పీకర్ ఆధారాలు సరిపోవన్న కారణంతో కొట్టివేశారు. ఈ నిర్ణయాలపై బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించగా.. పలువురు ఎమ్మెల్యేలు, స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ముఖ్యంగా ఏడుగురు ఎమ్మెల్యేల కేసుల్లో రికార్డులు, కౌంటర్ అఫిడవిట్లు సమర్పించాలని కోర్టు కోరింది. అంటే.. అసలు పోరాటం ఇప్పుడు స్పీకర్ గదుల నుంచి న్యాయస్థానాల మెట్ల దాకా చేరింది.
2026 మార్చి నాటికి పది మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదురొన్న ఎమ్మెల్యేలపై విచారణలు పూర్తి చేసి, అందరికీ అనర్హత వర్తించదని నిర్ణయించినట్టు సుప్రీంకోర్టులో స్పీకర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. అయితే దానం కేసులో హైకోర్టు ఆ ‘క్లీన్ చిట్’ను పకనపెట్టింది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండగానే కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అంశాన్ని కోర్టు కీలకంగా పరిగణించింది. స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షిస్తూ హైకోర్టు స్వయంగా అనర్హత ప్రకటించడం ఈ వ్యవహారానికి కొత్త న్యాయ పరిణామం తీసుకొచ్చింది. ఇదే ఇప్పుడు మిగిలిన కేసులకు పరీక్షగా మారింది.
దానం నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే మిగిలిన ఎనిమిది మంది విషయంలో ఉప ఎన్నికలు ఇప్పుడే అనివార్యమని చెప్పడం తొందరపాటు చర్య అవుతుందని కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. వారి కేసులు విడివిడిగా విచారణకు లోబడి ఉన్నాయని, తుది ఫలితం ఆయా న్యాయపరమైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఒకవేళ మిగిలిన కేసుల్లోనూ స్పీకర్ నిర్ణయాలు కోర్టు సమీక్షలో నిలబడకపోతే మాత్రం తెలంగాణలో వరుస ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. ఒకేసారి అనేక అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు వస్తే, అవి కేవలం స్థానిక ఎన్నికలుగా కాకుండా ఫిరాయింపులపై ప్రజా తీర్పుకు వేదికగా మారే అవకాశం ఉంటుంది.
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంఖ్యాపరంగా ప్రమాదం లేకపోయినా, రాజకీయంగా, నైతికంగా తీవ్రమైన ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తున్నది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిణామం భారీ ఊరటనివ్వడమే కాకుండా, క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఫిరాయింపుదారులను సులువుగా కలుపుకోవచ్చనుకున్న అధికార పక్ష అహంకారానికి, పదవులను కాపాడుకోవచ్చని భావించిన ‘గోపీ’ల అత్యాశకు న్యాయస్థానం వేసిన ఈ సంకెళ్లు తెలంగాణ రాజకీయ దిశను కొత్త తీరాలకు చేరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.