సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ కేసు ఎదుర్కొంటున్న అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఉదంతం నిమ్స్‌లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భాస్కర్ ఘటనతో దవాఖానలోని ఇతర అవినీతి అధికారుల జాబితా సైతం బయటకు వస్తుండడంతో నిమ్స్‌లోని మరికొందరు ‘అవినీతి భాస్కర్ల’ను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టిన వారిలో చాలా ‘భాస్కరులు’ ఉన్నారని, వారిలో ఇటీవల డైరెక్టర్ పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన ఒక కీలక అధికారి అవినీతి చిట్టాపై కూడా అటు ఏసీబీ, ఇటు ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. నిమ్స్‌ను రాబందులా దోచుకుంటున్న ప్రధాన అవినీతి పరుల్లో ఒకరుగా పేరున్న సదరు అధికారి.. కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం.
డాక్టర్ లక్ష్మీభాస్కర్ తీగ లాగితే నిమ్స్‌లో పాతుకుపోయిన అవినీతి డొంక కదులుతోంది. డైరెక్టర్ పోస్టు కోసం అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూ భంగపడుతున్న వైద్యాధికారితో పాటు నెఫ్రాలజీ విభాగంలో ఇద్దరు కీలక వైద్యాధికారులు, ఆర్థో విభాగంలో ఒకరు, పరిపాలనా విభాగానికి సంబంధించి ఇద్దరు అధికారులు సైతం అందినకాడికి దోచుకున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరితో పాటు మరో ఇద్దరు కీలక అధికారులను సైతం ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. భాస్కర్ ఘటనతో అక్రమార్కుల బాధితులు, ప్రత్యర్థులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ వారి అవినీతి చిట్టాలను నిఘా వర్గాలకు చేరవేస్తున్నట్లు సమాచారం. దీంతో ఏసీబీ సహా ఇతర దర్యాప్తు సంస్థలు నిమ్స్ అవినీతి బ్యాచ్ బాగోతాలను బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యాయి.
నిమ్స్‌లో జరిగిన అక్రమాలకు సంబంధించి కొందరు మాజీ డైరెక్టర్ల వ్యవహారంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. డా.లక్ష్మీభాస్కర్‌కు సహకరించడంతో పాటు కొందరు డైరెక్టర్లు తమ స్వార్థపూరిత నిర్ణయాలతో సంస్థను అందినకాడికి దోచుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. వైద్యుల నియామకాల్లో సైతం పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకోవడం, మంజూరు లేని పోస్టుల్లో అక్రమంగా నియామకాలు జరపడం, ఓ రిటైర్డ్ వైద్యాధికారి కుమారుడిని అక్రమంగా నియమించడం వంటి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. గతంలో పనిచేసిన నలుగురు డైరెక్టర్ల వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.
డా.లక్ష్మీ భాస్కర్ ఉదంతంతో దవాఖానలోని కొంత మంది ఎవరికి వారు అంతర్మథనం చెందుతున్నారు. తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని కొందరు అధికారులు జరుగుతున్న దర్యాప్తుపై తమకున్న పలుకుబడి, పరిచయాల ద్వారా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా భాస్కర్ బ్యాచ్ సైతం జరగబోయే పరిణామాలను అంచనాలు వేసుకుంటూ.. జాగ్రత్తలు పడుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, దర్యాప్తులో భాగంగా నిమ్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న కొందరు అధికారులు, సిబ్బందితో పాటు పదవీ విరమణ చేసిన వారిలో సైతం కొందరిని విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.