హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షలో క్వాలిఫై అయిన వారికి ముద్రిత మెమోలు జారీచేయనున్నారు. ఇవి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లాగే ఉంటాయి. వీటిని మీ సేవా కేంద్రాల ద్వారా జారీచేస్తారు. సర్టిఫికెట్‌పై ప్రత్యేకంగా ఒక బార్కోడ్, నంబర్ సైతం ఉంటాయి. 2011 నుంచి ఇప్పటి వరకు టెట్ పరీక్ష పాసైన వారందరికి ముద్రిత మెమోలు జారీచేస్తామని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మెమోను పొందేందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ మెమోపై అభ్యర్థి పేరు, ఫొటో, వేలిముద్ర/ సంతకం, అభ్యర్థి పొందిన మార్కుల వివరాలుంటాయి. గతంలో టెట్ పరీక్ష పాసైన వారికి రెండు సార్లు ముద్రిత మోమోలు జారీచేశారు. ఆ తర్వాత ఆన్లైన్ మెమోలను మాత్రమే జారీచేస్తున్నారు. దీంతో కొందరు నకిలీ మెమోలు తయారుచేస్తున్నట్టు విద్యాశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ముద్రిత మెమోలు జారీచేయాలని నిర్ణయించింది.