The Paradise Review | నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేసిన ‘దసరా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అదే కాంబినేషన్లో ‘ది ప్యారడైజ్’ ప్రకటనతోనే ఆసక్తిని పెంచింది. గ్లింప్స్, టీజర్, ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల కట్ట’.. ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లేకుండానే సినిమాను రిలీజ్ చేసినప్పటికీ బజ్ విషయంలో ఎక్కడా డోకా లేదు. మరి ఇంత భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుందా? అసలు ‘ది ప్యారడైజ్’ కథ ఏమిటి? గుర్తింపు కోసం సవారీ జాతి చేసిన పోరాటం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? రివ్యూలో చూద్దాం.
కథ గురించి..
హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న ప్యారడైజ్‌లో సవారీ జాతి ప్రజలు నివసిస్తుంటారు. ఆ జాతికి ఒక చరిత్ర ఉంది. స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఆ జాతి వారు పాల్గొన్నారు. కాకపోతే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సవారీ జాతికి ఎలాంటి గుర్తింపు లభించలేదు. వారు జనాభా లెక్కల్లో లేరు. ఓటు హక్కు లేదు. ఈ దేశానికి సంబంధించిన ఎలాంటి రక్షణ వారికి లేదు. అసలు వాళ్ల ఉనికినే ఎవరూ పట్టించుకోని పరిస్థితి. దీనికి కారణం శికంజ్ మాలిక్ (మోహన్ బాబు). సవారీ జాతి ప్రజలు తమకు గుర్తింపు కావాలని ఎంత మొరపెట్టుకున్నా.. ఆ జాతికి గుర్తింపు రాకుండా శికంజ్ అడ్డుకుంటుంటాడు. సవారీ జాతిపై శికంజ్ పగ ఏమిటి? సవారీ జాతిలో పుట్టిన జడల్ (నాని) ఆ జాతి కోసం ఎలాంటి పోరాటం చేశాడు? చివరికి ఆ జాతికి గుర్తింపు వచ్చిందా లేదా? అనేది మిగతా కథ.
విశ్లేషణ..
‘ది ప్యారడైజ్’ ఒక రెవల్యూషనరీ యాక్షన్ డ్రామా. తమ ఉనికి కోసం సవారీ జాతి ప్రజలు చేసిన పోరాటమే ఈ కథ. ఈ కథను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మదర్ సెంటిమెంట్, యాక్షన్ ప్రధానంగా నడిపించాడు. సవారీ జాతి ప్రజల ప్రపంచాన్ని, వారి చరిత్రను పరిచయం చేస్తూ కథ మొదలవుతుంది. సమ్మక్క (సోనాలి కులకర్ణి) ఓ బిడ్డకు జన్మనివ్వడం, సవారీ జాతి కోసం ఆమె పోరాటం, నాని జడల్ అనుకోని కారణాల వల్ల జైలుకు వెళ్లడం వంటి సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది.
జైలు నుంచి బయటకు వచ్చిన జడల్ తన ప్రజల కోసం ఏం చేశాడు అనే కోణం ఆసక్తికరం. శికంజ్ మాలిక్, అతని కొడుకు రాఘవ్ పాత్రలు కథలో సంఘర్షణను క్రియేట్ చేస్తాయి. వారిద్దరితో నానికి ఉన్న వైరం కథలో క్రమంగా పెంచుతూ వెళ్లడం, ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. కాకపోతే సెకండాఫ్‌లో కథ పక్కదారి పట్టిన ఫీలింగ్ కలుగుతుంది. స్వయం ప్రతిపత్తి గల ఒక రాజ్యాన్ని ప్రకటించుకోవడం అనే ఆలోచన కాస్త వాస్తవానికి దూరంగా అనిపిస్తుంది. దర్శకుడి ఆలోచన వేరుగా ఉన్నప్పటికీ.. ఆ సన్నివేశాలు ప్రేక్షకుడికి అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. అయితే దర్శకుడు కథను యాక్షన్, ఎమోషన్‌తో ముడిపెట్టి నడిపించాడు. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు యాక్షన్‌ను ఇష్టపడే ప్రేక్షకులను అలరిస్తాయి.
నటీనటుల నటన..
జడల్ పాత్రలో నాని ఒదిగిపోయాడు. ఇంత మాస్ యాక్షన్ క్యారెక్టర్ చేయడం నానికి ఇదే ఫస్ట్ టైం. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అలాగే తెలంగాణ యాస కూడా నానికి బాగా సెట్ అయింది. సుబ్బు పాత్రలో చేసిన కయాదు లోహార్ రెగ్యులర్ పాత్రలకు కొంచెం భిన్నంగా కనిపించింది. ప్రేమకథలో పెద్ద బలం లేకపోయినప్పటికీ.. సుబ్బు బ్యాక్‌స్టోరీ కాస్త ఆసక్తికరంగా ఉంది. మోహన్ బాబు శికంజ్ మాలిక్‌గా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంది. బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ బాబు కొత్తగా కనిపించాడు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఆయనకు నిజంగానే కొత్త. సమ్మక్క గా చేసిన సోనాలి కులకర్ణి ఆ పాత్రను హుందాగా చేసింది. లాయర్ పాత్రలో కనిపించిన సత్యరాజ్, తనికెళ్ల భరణి పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
ఈ సినిమాలో ప్రత్యేకంగా నిలిచిన మరో పాత్ర ఎమ్మెల్యే శంకరన్న. ప్రియదర్శి చేసిన ఈ పాత్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పోలి ఉంటుంది. కేసీఆర్ గారు ప్రెస్‌మీట్స్‌లో మాట్లాడిన మాటలు, ఆయన స్టేట్మెంట్స్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్‌ను పోలి ఉండేలా ప్రియదర్శి పాత్రలో చెప్పిన డైలాగ్స్ థియేటర్లలో ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ క్యారెక్టర్‌కు థియేటర్లలో అద్భుతమయిన రెస్పాన్స్ వచ్చింది.
టెక్నికల్‌గా..
అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల కట్ట’.. ఈ రెండు పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘ది ప్యారడైజ్’ కోసం దర్శకుడు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. కెమరా వర్క్ రా, రస్టిక్ టోన్ కి పర్ఫెక్ట్ గా ఉంది. ఎడిటింగ్‌లో కొన్ని జంప్స్ కనిపిస్తాయి. సినిమాను చాప్టర్లుగా విభజించారు. అయితే ప్రతి చాప్టర్‌కు మధ్య ఎమోషన్ కొనసాగించడంలో అక్కడక్కడ కొంత తడబాటు కనిపించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
నాని పెర్ఫార్మెన్స్
సాంగ్స్
యాక్షన్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
సెకండాఫ్‌లో అక్కడక్కడ కొంత ల్యాగ్
కొన్ని సన్నివేశాలు కన్విన్సింగ్‌గా అనిపించకపోవడం
రేటింగ్: 3/ 5