Sampoornesh Babu | ‘హృదయ కాలేయం’ సినిమాతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలు, మాట్లాడిన తీరు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. కాగా, సంపూర్ణేష్ బాబు ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో పరిశ్రమలోకి వచ్చి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘హృదయ కాలేయం’తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన ఆయన.. ఆ తర్వాత పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. ప్రస్తుతం నాని కథానాయకుడిగా నటించిన ‘ది ప్యారడైజ్’లోనూ ఆయన కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో సంపూర్ణేష్ బాబును ఇంటర్వ్యూయర్ వ్యక్తిగతంగా కించపరిచేలా ప్రశ్నలు అడిగినట్లు కనిపిస్తోంది. ఆయన హీరోగా ఎలా మారారని ప్రశ్నిస్తూ.. కుటుంబంలో ఎవరైనా సినీ రంగంలో ఉన్నారా? అనే అంశాన్ని ప్రస్తావించారు. అంతటితో ఆగకుండా ఆయన రూపురేఖలను ఉద్దేశించి కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎదురుగా కూర్చున్న సంపూర్ణేష్ బాబు ఆ వ్యాఖ్యలకు వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. ఆయన ముఖంలో అసౌకర్యం, బాధ కనిపించిందంటూ ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా పలువురు సినీ అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇంటర్వ్యూకు పిలిచి ఒక నటుడిని వ్యక్తిగతంగా అవమానించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.
ఒక నటుడి ప్రతిభను అతడి రూపం, కుటుంబ నేపథ్యం లేదా వ్యక్తిగత విషయాలతో ముడిపెట్టి మాట్లాడటం సరైన పద్ధతి కాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చే ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు సినిమా, పాత్రలు, నటుడి అనుభవాల చుట్టూనే ఉండాలని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం వైరల్ అవుతున్న వీడియో పూర్తిస్థాయి ఇంటర్వ్యూ కాదని, కేవలం కొంత భాగం మాత్రమే బయటకు వచ్చి ఉండొచ్చని పేర్కొంటున్నారు. దీంతో మొత్తం సందర్భం తెలియకుండా తుది నిర్ణయానికి రావడం సరికాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సంపూర్ణేష్ బాబు నటించిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రంలో నాని, కయాదు లోహర్, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.