కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 10 : ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ఆపసోపాలు పడుతుందని విమర్శించారు. ఈ 15 నెలల కాలంలో రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, సబ్బండ వర్గాలు ఆనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ వర్గాలను మోసం చేసి బూటకపు మాటలతో అరాచక పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తే, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ప్రజలంతా గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. అధికార మదంతో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ యధేచ్చగా దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఏ ఎన్నికైనా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.
ఈ 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సన్నాహక సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్, తోగరు రాజశేఖర్, కాపు సీతాలక్ష్మి, బాదావత్ శాంతి, వేల్పుల దామోదర్, సంకుబాపన అనుదీప్, కొట్టి వేంకటేశ్వర్రావు, మంతపురి రాజుగౌడ్, కిలారు నాగేశ్వర్ రావు, బట్టు మంజుల, బత్తుల వీరయ్య, సింధు తపస్వి, టీబీజీకే ఎస్ రాష్ట్ర కార్యదర్శి కాపు కృష్ణ, అన్వర్ పాషా, మాధవీలత, నవతన్, మునీల, బత్తుల శ్రీను, హైమద్ పాల్గొన్నారు.