జూలూరుపాడు, అక్టోబర్ 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధ్వంసమైన రహదారుల మరమ్మతులను వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు మంగళవారం వినూత్న రీతిలో డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టారు. జూలూరుపాడు మండలం పడమట నరసాపురం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై ఏర్పడ్డ భారీ గుంతల సమీపంలో రోడ్డుపై బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లాకావత్ గిరిబాబు కూర్చొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కొత్తగూడెం– ఖమ్మం మార్గంలోని జూలూరుపాడు మండలంలోని కొమ్ముగూడెం గ్రామం నుండి వైరా వరకు ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మరమ్మతులు చేపట్టకపోవడం దారుణం అన్నారు. రహదారులు ధ్వంసమైన తీరు కన్పించేలా సెల్ఫీలు దిగి ప్రసార మాధ్యమాలకు ఫొటోలను విడుదల చేసి నిరసన వ్యక్తం చేశారు. రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ స్థానిక నాయకులు, గ్రామ పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.
Julurupadu : రహదారుల మరమ్మతులు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకుల నిరసన