కొత్తపల్లి, ఫిబ్రవరి 26: మీ పిల్లలను క్రీడా పాఠశాలల్లో చేర్పించాలనుకుంటున్నారా..? విద్యతోపాటు ఆటల్లో మెరికల్లా మార్చి బంగారు భవితకు బాటలు వేయాలని ప్లాన్ చేస్తున్నారా..? మరెందుకు ఆలస్యం ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది?, కరీంనగర్‌తోపాటు రాష్ట్రంలోని మరో రెండు క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. కాగా, 2017 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులని, మూడు దశల్లో ఎంపిక పోటీలు ఉంటాయని కరీంనగర్ జిల్లా యువజన క్రీడాశాఖాధికారి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
ఈనెల 26 నుంచి మార్చి 4 లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. తొలి విడత మార్చి 13 నుంచి 17 వరకు మండల స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తామని, ఆ తర్వాత మార్చి 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా స్థాయి, ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్స్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్, 60 మీటర్ల షటీల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్ పోటీలు ఉంటాయని, ఫ్లెక్సిబులిటీ టెస్ట్, ఎత్తు, బరువు నమోదు చేస్తామని వివరించారు.
మొత్తం తొమ్మిది విభాగాల్లో 27 మార్కులకు ఫిజికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల వయసు ధ్రువీకరణ పత్రం, 3వ తరగతి స్టడీ సర్టిఫికెట్, ప్రోగ్రెస్ కార్డు, ఆధార్ కార్డు, కులం సర్టిఫికెట్, 5 ఫొటోలు జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు http:tgss.telangana.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయి ఆన్లైన్ వివరాలు నమోదు చేసుకొని మండల, జిల్లాస్థాయి పోటీలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 9704061725, 8008326913 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.