చర్ల, ఏప్రిల్ 23 : పేద, బడుగు బలహీనవర్గాల రైతుల భూ సమస్యల పరిష్కారం భూ భారతి చట్టం ద్వారా లభించనుందని భద్రాచలం నియోజకవర్గ శాసన సభ్యుడు డాక్టర్ వెంకట్రావు తెలిపారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బుధవారం చర్లలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని చట్టం గురించి వివరించారు. భూములకు సంబంధించిన రికార్దుల్లో గతంలో అనేక అవకతవకలు జరిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారమే భూ భారతి ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సదస్సులో భద్రాచలం ఆర్డీఓ దామోదర్‌రావు, తాసీల్దార్ మొగిలి శ్రీనివాసరావు పాల్గొన్నారు.