భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ) : వానలు ఎక్కడ కురిసినా..తుఫాను ఎక్కడ తీరం దాటినా దిగువ ప్రాంతాలకే తిప్పలు తప్పడం లేదు. ఎగువున వరదలు.. దిగువున దిగులు అన్నట్లుగా ప్రతి యేటా వరద ప్రభావిత గ్రామాలకు ముంపు కష్టాలు తప్పడం లేదు.ప్రతి యేటా జులై, ఆగస్టు నెలలు వస్తే భద్రాచలం డివిజన్ పరిధిలోని గ్రామాలు వరద భయానికి ప్రాణాలు అర చేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది.
రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంటే భద్రాచలం ముంపు గ్రామాలకు వరద కష్టాలు తప్పడం లేదు. గత నెల రోజుల నుండి వరద ప్రవాహం భద్రాచలాన్ని పోటెత్తుతూనే ఉంది. ఇప్పటికి రెండుసార్లు రెండవ ప్రమాద హెచ్చరికను దాటి వరద ఉగ్రరూపాన్ని చూపెట్టింది. ప్రతిసారి రోజుల తరబడి వరద ప్రవాహం భద్రాచలం డివిజన్ తో పాటు బూర్గంపాడు మండలాల సైతం ఆనుకొని ఉండటంతో ముంపు గ్రామ ప్రజలు ఈ సమయంలో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే ఆయా గ్రామాల్లో వరద నీరు చేరడంతో పరిసర గ్రామాలకు రాకపోకలు తెగిపోతున్నాయి. తెలంగాణ తీర ప్రాంతంలోనే కాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురిస్తే భద్రాచలంకే ముప్పు వాటిల్లు తుంది. భద్రాచలం పట్టణం మాత్రం తెలంగాణలో ఉన్నప్పటికీ పరిసర గ్రామాలు అంతా భద్రాచలం మీదనే ఆధారపడి బతుకుతున్నాయి.
గ్రామాలకు గోదారి వరద తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆంధ్ర ప్రాంతం నుండి భద్రాచలానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోవటంతో అక్కడ ప్రాంత వాసులు భద్రాచలం రావటానికి కష్టతరం అవుతుంది. దీంతోపాటు సరళ దుమ్ముగూడెం ప్రాంతాలకు భద్రాచలంతో రాకపోకలు తెగిపోతున్నాయి. పట్టణంలోని రామాలయం సమీపంలో వరద నీరు చేరటంతో అక్కడ ఉన్న ప్రజలు ముందస్తుగానే ఎత్తు ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వస్తోంది.
మళ్లీ తుఫాను వచ్చే అవకాశం
మరోసారి తుఫాను ప్రభావం వస్తుందని హెచ్చరికలు జారీ చేయడంతో ముంపు మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే భద్రాచలంలో వరద ప్రభావం రెండోసారి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించినప్పటికి ఇంకా 47 అడుగుల నీటిమట్టంలోనే ఉంది. ఈ ప్రవాహంలో మరో తుఫాను ముంచుకొస్తే భద్రాచలం, బూర్గంపాడు మండలాల ప్రజలకు తీవ్ర నష్టమే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి.