అతిగా ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలు పిల్లల్లో మానసిక రుగ్మతలకు కారణం అవుతున్నాయి. తాజాగా, కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాలపై ఓ పరిశోధన నిర్వహించారు. ఇందులో భాగంగా 2,000 కంటే ఎక్కువ మంది పిల్లలను పరిశీలించారు. వారి ఆహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యలను క్షుణ్నంగా విశ్లేషించారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే ఐదేళ్లలలోపు చిన్నారుల్లో ఆందోళన, భయం, దూకుడు లాంటివి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా, మెదడు ఎదుగుదలకు అవసరమైన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు తక్కువగా ఉంటాయి. వీటి తయారీలో ఉపయోగించే కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్లు.. పిల్లల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయట. వీటిలోని అధిక చక్కెర వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అకస్మాత్తుగా పెరగడం, తగ్గడం వల్ల.. పిల్లల్లో చిరాకు, ఏకాగ్రత లోపిస్తుంది. వీటిలో వాడే కృత్రిమ రంగులు కూడా ఏడీహెచ్‌డీ వంటి హైపర్ ఆక్టివిటీ లక్షణాలను ప్రేరేపిస్తాయి. కాబట్టి, పిల్లల మెదడు అభివృద్ధి చెందే దశలో అతిగా ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలు తీసుకోవడం ఏమాత్రం మంచిదికాదని పరిశోధకులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.