రామవరం ,జులై 07 : వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సింగరేణి ప్రధాన ఆస్పత్రి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లలిత కార్మికులకు సూచించారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని వీకే వర్క్‌షాప్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వర్షాకాలంలో విష జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలుషిత నీరు, కలుషిత ఆహారం, అపరిశుభ్ర వాతావరణం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయన్నారు. పందులు, ఈగలు, దోమలు విషజ్వరాల వ్యాప్తికి ప్రధాన వాహకాలుగా ఉంటాయని, వాటికి దూరంగా ఉండాలన్నారు.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఉపేందర్ బాబు మాట్లాడుతూ.. సింగరేణి సీఅండ్ఎండీ బలరాం నాయక్ కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు ఆధ్వర్యంలో వాటిని అమలుపరుస్తున్నామని తెలిపారు. ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకొని కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. పిట్ కార్యదర్శి మధు కృష్ణ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు చాలా ప్రమాదకరమని, వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ కార్మికులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
వర్క్‌షాప్ డీజిఎం శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుమ్మడి వీరయ్య, కరుణాకర్, రాజేందర్, సముద్రాల శ్రీనివాస్, శామ్యూల్ సుధాకర్, కిరణ్ కుమార్, అంకుష్, ఆరేళ్లి కృష్ణ, సలిగంటి శ్రీనివాస్, బొజ్జ వెంకటస్వామి, బాబాదిన్, ఎనగంధుల వెంకటేశ్వర్లు, నరేందర్, టీఆర్ఎస్ రాజు, సత్యనారాయణ, వాసంతిక, ఉమ స్పందన, రాజయ్య, అన్ని సెక్షన్ల కార్మికులు, అప్రెంటిస్‌లు పాల్గొన్నారు.