– బీఆర్ఎస్ నేత లకావత్ గిరిబాబు
జూలూరుపాడు, మే 11 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసుల తీరును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా తప్పుబట్టారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు యల్లంకి సత్యనారాయణ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం, పోలీసుల వైఖరిపై నిప్పులు చెరిగారు. బీసీ వర్గానికి చెందిన ఒక బాలికను బండి భగీరథ మానసిక, లైంగిక వేధింపులకు గురిచేయడం అత్యంత దుర్మార్గమన్నారు. సామాన్యుడికి ఒక చట్టం, కేంద్ర మంత్రి కుమారుడికి మరో చట్టమా అని ఆయన ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదై ఇన్ని రోజులవుతున్నా నిందితుడిని అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యానికి పరాకాష్ట అని విమర్శించారు.
పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్లు చేర్చకుండా కేవలం 11వ సెక్షన్ పెట్టడం ద్వారా నిందితుడిని కాపాడేందుకు కుట్ర జరుగుతోందన్నారు. బాధితులు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తే తప్ప కేసు నమోదు చేయలేదని, ఇది వ్యవస్థల దౌర్భాగ్యమన్నారు. బాధిత తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్న బండి సంజయ్‌పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దుద్దుకూరి నాగేశ్వరరావు, తాళ్లూరి రామారావు, సాయిల నాగేశ్వరరావు, రాయపాటి వెంకటేశ్వర్లు, ఇల్లంగి తిరుపతి, బుడిపూడి ప్రభాకర్, బుడిపూడి ప్రతాప్, గుండెపూడి ఉప సర్పంచ్ బాదావత్ నరేష్ పాల్గొన్నారు.