రుద్రంపూర్, జూన్ 08 : సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ పట్ల కూడా వివక్షత ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ ఇకపై ఉపేక్షించేది లేదని ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ హెచ్చరించింది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటిస్తూ సోమవారం సాయంత్రం సింగరేణి యాజమాన్యానికి అధికారికంగా సమ్మె నోటీసు అందజేసినట్లు నాయకులు వెల్లడించారు. కొత్తగూడెం ఆర్‌సీఓఏ క్లబ్లో రెండు రోజులపాటు జరిగిన ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశం ఘనంగా ముగిసింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు తమ ప్రసంగాల్లో సింగరేణిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ, యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు భంగం కలిగించే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల గోలేటి నుంచి కొత్తగూడెం వరకు నిర్వహించిన సింగరేణి జాత విజయవంతం కావడంలో సహకరించిన నాయకులు, కార్యకర్తలు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి ఈ క్రింది డిమాండ్లను ముందుంచారు.
– రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణికి రావాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిల విడుదల
– కొత్త గనుల ప్రారంభం
– మెడికల్ బోర్డు నిర్వహణ
– 2025–26 లాభాల వాటాలో 40 శాతం బోనస్ చెల్లింపు
– మారుపేర్లు, విజిలెన్స్ కేసుల పరిష్కారం
– సొంత ఇంటి పథకం అమలు
– పెర్క్స్‌పై ఆదాయపు పన్ను భారం యాజమాన్యమే భరించడం
– క్లర్క్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న ఇతర విభాగాల పోస్టుల భర్తీ
– 400 మంది డిపెండెంట్లకు ఉద్యోగాల కల్పన
– డిస్మిస్ అయిన కార్మికులకు ఒకసారి అవకాశం కల్పించడం
– సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా
– ఓవర్మెన్లు, ఇతర ఉద్యోగుల పెండింగ్ ప్రమోషన్ల అమలు
దాదాపు 30 డిమాండ్ల సాధన కోసం సమ్మె నోటీసు ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి ఎస్.కే. షబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, మిర్యాల రంగయ్య, సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, మడ్డి ఎల్లయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, వంగ వెంకట్, వీరస్వామి, వివిధ ఏరియాల బ్రాంచ్ కార్యదర్శులు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు, టౌన్ పార్టీ కార్యదర్శి జములయ్య, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కొమరయ్య కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

సింగరేణి యాజమాన్యానికి ఏఐటీయూసీ సమ్మె నోటీసు