పాల్వంచ, జూన్ 17 : కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీని అరికట్టాలని, విద్యా సంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వర్క అజిత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం పాల్వంచ ఎంఈఓ ఎ.శ్రీరామ్ మూర్తికి వినతిపత్రం అందజేశారు. అనంతరం అజిత్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం పునః ప్రారంభమైనందున ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి తక్షణమే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం విద్యార్థులకు అందజేయాలన్నారు.
పాల్వంచలో విచ్చలవిడిగా వెలసిన కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులును వసూలు చేస్తున్నారని, విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేయడమే కాక విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ మొత్తం తమ వద్దే కొనుగోలు చేయాలని షరతులు పెడుతున్నారని, వాటిని తమ ఇష్టానుసారంగా అధిక రేట్లకు అమ్ముతున్నారని, తక్షణమే ఈ అమ్మకాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు ఏఐఎస్ఎఫ్ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల సృజన్, వెంకటేశ్, చందూలాల్, రాజు, శ్రీకాంత్, రాము పాల్గొన్నారు.