జూలూరుపాడు, జూన్ 14 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందుకే మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సమాధానం చెప్పలేక ఏసీబీ నోటీసులు అని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ సీనియర్ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. శనివారం ఆయన స్పందిస్తూ.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడం చాలా దుర్మార్గమన్నారు. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టే విధంగా కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడం జరిగిందని, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కక్షసాధింపు చర్యలు చేపడుతూ ఏదోరకంగా కేటీఆర్‌ను కేసులో ఇరికించి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నట్లు దుయ్యబట్టారు. ఇలాంటి బెదిరింపు ధోరణులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ధి చేసింది ఎవరో, అవినీతి చేస్తున్నది ఎవరో వాస్తవాలు త్వరలో బయటికి వస్తాయని, విజ్ఞత కలిగిన ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.