పాల్వంచ, మార్చి 29 : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని, అలాగే ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. శనివారం పాల్వంచలో టీఎస్‌యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం 15 శాతం కేటాయించాలని క్రమంగా దీన్ని 20 శాతానికి పెంచాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రాథమిక పాఠశాలల బలోపేతం కోసం ప్రత్యేక కేంద్రీకరణ జరగాలని, పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని, పాఠశాలల పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని, వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టి, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బకాయి పడిన ఐదు వాయిదాల డీఏను వెంటనే విడుదల చేయాలన్నారు. పీఆర్సీ నివేదిక తెప్పించుకుని సంఘాలతో చర్చించి అమలు చేయాలన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ పథకం సక్రమంగా అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి షేక్ పాషా, మండల అధ్యక్షుడు ఎ.విజయభాస్కర్, సీనియర్ నాయకులు బి.జానకి రాములు, ఎ.నరసింహారావు పాల్గొన్నారు.