karepalli | కారేపల్లి, మార్చి 29: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని కారేపల్లి ఎస్సై బైరు గోపి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న‘రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్’కార్యక్రమంలో భాగంగా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రామలింగాపురం (కారేపల్లి క్రాస్ రోడ్)లో ఆదివారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు, నివారణ గురించి ఎస్సై గోపి మాట్లాడుతూ.. ముఖ్యంగా రోడ్డు భద్రత, నియమాలపై అవగాహన లోపం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు.
మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం ప్రమాదకరమన్నారు. అలాగే రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురైన వ్యక్తులను ప్రాథమిక చికిత్స నిమిత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీపీఆర్పైన అవగాహన కల్పించారు. ‘సురక్షిత ప్రయాణం-సంతోషకర గమ్యం’అనే లక్ష్యంతో అందరూ కలిసి పని చేయాలని ఈ సందర్భంగా ఎస్సై పిలుపునిచ్చారు.
అనంతరం రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ.. వాహనాలు నడుపుతూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బందితోపాటు ఆటో డ్రైవర్లు, వాహన యజమానులు, స్థానిక ప్రజలు యువకులు పాల్గొన్నారు.

Read Also :
Chennur | చెన్నూరులో దారుణం..టీచర్ల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య?
Pakistani ships | ‘హర్మూజ్’ గుండా 20 పాక్ నౌకలకు అనుమతి.. శాంతికి సంకేతమన్న పాకిస్థాన్
Anakapalli Teaser | త్రిణాధరావు నక్కిన మార్క్ స్టోరీతో ‘అనకాపల్లి’.. ఆకట్టుకుంటున్న టీజర్