రుద్రంపూర్, జూలై 31 : సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా విశిష్ట సేవలందించిన ఎం.షాలెమ్ రాజు శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా రుద్రంపూర్ ఆర్‌సీఓఏ క్లబ్లో సింగరేణి అధికారులు, గుర్తింపు పొందిన కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించి సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. 38 సంవత్సరాల పాటు సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన, గనుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం, సమర్థవంతమైన పరిపాలనలో ఎం. షాలెమ్ రాజు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మైనింగ్ ఇంజనీర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన ప్రతిభ, కృషితో వివిధ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నత స్థానాలకు ఎదిగారని తెలిపారు.
ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్‌గా విజయవంతంగా సేవలందించిన అనంతరం, 2023 జూన్ 19న కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.షాలెమ్ రాజు తన సమర్థ నాయకత్వంతో గనుల్లో భద్రతతో కూడిన ఉత్పత్తిని పెంపొందించడమే కాకుండా అధికారులు, ఉద్యోగులతో సమన్వయం పాటిస్తూ ఏరియాను అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు. వీడ్కోలు సభలో సింగరేణి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ఎం. షాలెమ్ రాజు సుదీర్ఘ మైనింగ్ అనుభవం సంస్థ అభివృద్ధికి ఎంతో దోహద పడిందన్నారు. ఇల్లెందు, కొత్తగూడెం వంటి కీలక ఏరియాల్లో క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ గనుల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంతో శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
ఎం. షాలెమ్ రాజు మాట్లాడుతూ… సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో సుదీర్ఘకాలం పనిచేసి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేయడం తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన ఘట్టమని అన్నారు. తన ప్రయాణంలో నిరంతరం సహకరించిన యాజమాన్యానికి, తోటి అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు, ముఖ్యంగా రాత్రింబవళ్లు శ్రమించే సింగరేణి కార్మికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఎం.షాలెమ్ రాజు దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.