Ghee | నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవడం భారతీయ ఇళ్లలో సర్వసాధారణం. అయితే ఈ నెయ్యి కేవలం రుచిని పెంచడానికే కాదు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేదం పేర్కొంటోంది. ఈ చిట్కాలను వైద్య సలహాతో మాత్రమే పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యిని భారతీయ సంప్రదాయంలో ఎంతో విలువైన ఆహారంగా భావిస్తారు. బలహీనత, పొడి చర్మం, కీళ్ల నొప్పులు వంటి అనేక సమస్యలకు ఇది ఉపయోగపడుతుందని చాలాకాలంగా విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో శరీరానికి వెచ్చదనం అందించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలామంది రోజువారీ ఆహారంలో నెయ్యిని తప్పకుండా చేర్చుకుంటారు. జలుబు, ముక్కు దిబ్బడ లేదా సైనసైటిస్ వంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా నెయ్యితో చేసే కొన్ని ఇంటి చిట్కాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి నెయ్యిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను స్వల్పంగా వేయించి గోరువెచ్చగా తినడం. ఇది శరీరానికి వేడి అందించి ఉపశమనం కలిగిస్తుంది.
మరో సంప్రదాయ పద్ధతి ఏమిటంటే.. గోరువెచ్చని నెయ్యిని ఛాతి, చేతులు, కాళ్లపై మర్దనా చేయడం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరంలోని ఈ భాగాల ద్వారా చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిద్రపోయే ముందు కొద్దిగా గోరువెచ్చని నెయ్యిని చేతులు, కాళ్లకు రాస్తే శరీరం వెచ్చగా ఉండటంతోపాటు చర్మం పొడిబారకుండా కూడా సహాయపడుతుంది. ఆయుర్వేదంలో నస్య (Nasya) అనే చికిత్సా విధానంలో గోరువెచ్చని స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ముక్కులో కొన్ని చుక్కలు వేయడం గురించి కూడా ప్రస్తావిస్తారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ విధానం పాటిస్తే ముక్కు దిబ్బడ తగ్గి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన దిబ్బడ ఉన్నప్పుడు ఉదయం, రాత్రి నిద్రకు ముందు రోజుకు రెండు సార్లు చేయవచ్చని కూడా పేర్కొంటున్నారు.
అయితే ఈ విధానాన్ని తప్పనిసరిగా అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలి. ఉపయోగించే నెయ్యి స్వచ్ఛమైన ఆవు పాలతో తయారైనదై ఉండాలి. అలాగే అది కేవలం గోరువెచ్చగా మాత్రమే ఉండాలి; ఎక్కువ వేడిగా ఉంటే ముక్కు లోపలి భాగానికి హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంటి చిట్కాలు కొంత ఉపశమనం ఇస్తాయి. అయితే జలుబు, ముక్కు దిబ్బడ లేదా సైనస్ సమస్యలు ఎక్కువ రోజులు కొనసాగినా, జ్వరం, తీవ్రమైన నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించినా స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.